గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారిగా విజయం సాధించిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఇప్పుడు రాజకీయ వేదికపై ఆవేదనతో కనిపిస్తున్నారు. ప్రజల్లో చురుకుగా తిరిగే, సమస్యల పరిష్కారానికి కృషి చేసే మహిళా నేతగా పేరుతెచ్చుకున్న మాధవి, తాజాగా మాత్రం అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అధికారులు నా మాట వినడం లేదు, ఎమ్మెల్యేగా నన్ను పట్టించుకోవడం లేదు” అంటూ మీడియా ముందు ధ్వజమెత్తారు.


మాధవి ఆరోపణలతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో చర్చ మొదలైంది. నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పర్యటించే, ప్రజలతో నేరుగా మమేకమయ్యే నేతగా మాధవి పేరుంది. బైక్‌పై తిరుగుతూ పరిశుభ్రత, పారిశుధ్యంపై తనిఖీలు చేయడం, మహిళల కోసం ప్రత్యేక సమస్యల పరిష్కార కేంద్రం ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ఆమె ప్రజల మనసు గెలుచుకున్నారు. అలాంటి నేత ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం గురించి బహిరంగంగా మాట్లాడడం పార్టీ వర్గాలకూ ఆశ్చర్యం కలిగించింది.



ముఖ్యంగా మొంథా తుఫాన్ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నష్టాలను అంచనా వేయాలని చెప్పింది. కానీ, గుంటూరు పశ్చిమలో అధికారులు మాధవిని సంప్రదించకుండానే క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహించి నివేదికలు పంపేశారు. ఈ చర్యపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ప్రజల కోసం ఇక్కడ ఉన్నాను, కానీ అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఉన్నారా లేరా అన్న భావన కూడా కనిపించడంలేదు,” అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.



ఇక పార్టీ వర్గాల్లో అయితే కొత్త చర్చ మొదలైంది. అధికారులను తెరవెనుక మరో నేత నడిపిస్తున్నారా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆ నేత ఎవరో, ఆయనకు ఈ వివాదంలో ఏమిటి పాత్ర అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే గళ్ళ మాధవి మాత్రం ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ ప్రజల దృష్టి ఇప్పుడు ఒక్క దానిపైనే ఉంది — అధికారుల గర్వం గెలుస్తుందా? లేక ప్రజా ఎమ్మెల్యే మాట నిలుస్తుందా? మాధవి మాటలు ఆ నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: