వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. “జెన్-Z తరానికి చెందిన విద్యార్థులే భావి తరానికి దిక్సూచీలు” అని ఆయన వ్యాఖ్యానించడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం గురించిన విశ్లేషణలు వేగంగా పాకుతున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విద్యార్థి విభాగం నాయకులతో సమావేశమైన జగన్, విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ప్రభుత్వ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా రాజకీయ పర్యవేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.


జగన్ మాట్లాడుతూ, “మీ అందరూ జెన్-Z తరానికి చెందినవారు, భవిష్యత్‌లో సమాజానికి మార్గదర్శకులు కావాలి. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి” అని విద్యార్థి నాయకులను ప్రోత్సహించారు. విద్యార్థి దశలోనే మంచి రాజకీయ భవిష్యత్తుకు భీజం పడుతుందని చెప్పడం ద్వారా ఆయన విద్యార్థి విభాగాన్ని నేరుగా రాజకీయ రంగంలోకి తేవాలనే సంకేతాలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో విద్యార్థుల కోసం అమలు చేసిన పథకాలపై కూడా జగన్ గర్వంగా ప్రస్తావించారు. “విద్యాదీవెన” కింద రూ.12,609 కోట్లను ఖర్చు చేశామని, “వసతిదీవెన” ద్వారా ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.20 వేల చొప్పున అందించామని వివరించారు. అయితే ఇదే సమయంలో జగన్ చేసిన “ఇవాళ అన్నీ ధ్వంసం చేస్తున్నారు” అన్న వ్యాఖ్యలు ప్రస్తుత ప్రభుత్వంపై పరోక్ష విమర్శలుగా కనిపించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యార్థి సంక్షేమ పథకాలు వంటి అంశాలు జగన్ పాలనలో బలంగా నిలిచాయని, ఇప్పుడు అవి బలహీనపడుతున్నాయని ఆయన సూచించారు.

 

ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కొత్త ఉత్కంఠను రేపాయి. ఇక ‘జెన్-Z’ విద్యార్థి నాయకులను వైసీపీ కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొనమని జగన్ ప్రోత్సహించడం గమనార్హం. రాబోయే ఎన్నికల్లో యువత కీలక శక్తిగా మారుతారనే అంచనాతో జగన్ యువతను వైసీపీ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. గతంలో ఇంత స్థాయిలో విద్యార్థి విభాగం చురుకుగా పనిచేయలేదు. కానీ ఈసారి మాత్రం జగన్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అయితే ఈ చర్చల మధ్యలో విశాఖ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ పరిణామం మధ్యలోనే జగన్ “జెన్-Z” పిలుపు ఇవ్వడం రాజకీయ వ్యూహాత్మకంగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి, జగన్ కొత్త తరాన్ని వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు - ఈ ప్రయత్నం విజయవంతమవుతుందా లేదా అన్నది రానున్న ఎన్నికలే నిర్ణయించబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: