కొందికొన్ని జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయం సరిగా లేకపోవడం పాలన ప‌రంగా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కొన్ని జిల్లాల్లో మాత్రం అధికారులు అధిక ప్రాధాన్యతతో వ్యవహరిస్తూ, వారి మాటే చివరి మాట అనే వాతావరణం నెలకొంటోంది. దీంతో ప్రజలకు సేవలు చేరవేయడంలో జాప్యాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆలస్యం లాంటి అంశాలు పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఈ మధ్య ఈ సమస్యపై చంద్రబాబుకు పలువురు ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అందుకే త్వరలోనే ఈ అంశంపై కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.


అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు “ ఎవ‌రికివారే హీరోలు ” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నాయ‌కుల మ‌ధ్య పరస్పర సహకారం లోపించడం, అధికారులతో సమన్వయం తగ్గిపోవడం వల్ల పనులు ఎలా ఉన్నా ఆధిపత్య పోరే ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమైందని సమాచారం. తమతమ ప్రభావాన్ని నిలబెట్టుకునేందుకు సొంత పార్టీలోనే నాయకులు ఉదృతంగా వ్యవహరిస్తున్న సమీకరణాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. దీనిని అదుపు చేయాలని జిల్లా స్థాయిలో, పార్టీ ప్రధాన నాయకత్వం కూడా భావిస్తోంది.


అలాగే, కడప జిల్లాలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా మూడు నియోజకవర్గాల్లో కూటమి నాయకుల మధ్య విభేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకే కూటమిలో ఉన్నప్పటికీ పరస్పర అనుమానాలు, బాధ్యతల పంపకంలో అసంతృప్తి, నిర్ణయాల్లో సమన్వయ లోపం వంటి అంశాలు అక్కడ కూడా పరిస్థితిని క్లిష్టం చేస్తున్నాయి. ఈ అంశాలపై ఇటీవల పార్టీ అధినేత సమీక్ష నిర్వహించినట్టు, త్వరలోనే వివరమైన నివేదిక కోరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో బలమైన నాయకులు పోటీ నుంచి తప్పుకోవడంతో కొత్త వారికి, కొంతమంది వారసులకు అవకాశాలు ఇచ్చారు. దీంతో పాత, కొత్త నాయ‌కుల‌ మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది.


గతంలో పోటీ చేయని నాయకులు వచ్చే ఎన్నికల్లో తిరిగి బరిలోకి దిగాలనే ఉద్దేశంతో తమ ప్రభావాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో గతసారి టికెట్ పొందిన నాయకులు తమ స్థానాలు కాపాడుకోవాలన్న ఒత్తిడిలో పనిచేస్తుండటంతో వివాదాలు మరింత భగ్గుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో ఐక్యత నెలకొల్పడం, అధికారులను నియంత్రణలో ఉంచడం, జిల్లాల స్థాయి రాజకీయ సమీకరణాలను సరిచేయడం వంటి చర్యలు అత్యవసరంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ జిల్లాల్లో పరిస్థితులు ఏ మేరకు మారుతాయో… పార్టీ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: