శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎంపీ సీటు అంటేనే హాట్ కేక్. ముఖ్యంగా వైసీపీకి ఈ సీటు ఎప్పటికీ ఓ ఛాలెంజ్‌గానే మారింది. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మూడు లోక్‌సభ ఎన్నికల్లో మూడు సార్లూ వైసీపీకి చేదు అనుభవమే ఎదురైంది. టీడీపీ నుంచి పోటీ చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ సాధించి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి వారసుడిగా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం కేంద్రంలో కీలక మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పేరు శ్రీకాకుళం రాజకీయాల్లో బలమైన బ్రాండ్‌గా మారింది. అయితే ఇప్పుడు జిల్లా రాజకీయాల దిశ మారుతున్నాయనే చర్చ ఊపందుకుంది. రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా నరసన్నపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, ఎంపీ సీటు ఖాళీ అవుతుంది… అదే వైసీపీ నేతలకు కొత్త ఆశలకు బీజం వేస్తోంది. “ఈసారి కింజరాపు కుటుంబం ఎంపీ బరిలో లేకపోతే గెలుపు మనదే” అన్న నమ్మకం వైసీపీలో బలపడుతోంది.


అందుకే ఈసారి శ్రీకాకుళం ఎంపీ టికెట్ కోసం వైసీపీలో భారీ పోటీ కనిపిస్తోంది. గతంలో ఎంతమంది సీనియర్ నేతలను హైకమాండ్ అడిగినా ముందుకు రాని పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం బిగ్ షాట్స్ సైతం “మేమున్నాం” అంటూ రంగంలోకి దిగుతున్నారు. మాజీ స్పీకర్ తమ్మినెని సీతారాం ఈ జాబితాలో ముందున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా అనుభవం ఉన్న తమ్మినెని… ఎన్నాళ్లుగానో పార్లమెంట్‌కు వెళ్లాలనే ఆశతో ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ అవకాశం దక్కకపోయినా, ఈసారి లోక్‌సభ ద్వారానే ఢిల్లీ అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్నారని ప్రచారం. అందుకే పార్టీ పెద్దలు కూడా ఆయనకే శ్రీకాకుళం ఎంపీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారని టాక్. కానీ ఇక్కడే రాజకీయ ట్విస్ట్ మొదలైంది. టెక్కలిలో జరిగిన వైసీపీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. “తమ్మినెనిని రాజ్యసభకు లేదా ఎమ్మెల్సీగా పంపిస్తాం… ఎంపీ సీటు యువకులకు” అన్న మాటలు తీవ్ర చర్చకు దారి తీశాయి. కాళింగుల్ని పక్కన పెడుతున్నారంటూ దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేతలు బహిరంగంగా విమర్శించారు. తర్వాత కృష్ణదాస్ వివరణ ఇచ్చినా, అప్పటికే రాజకీయ వేడి పెరిగిపోయింది.



ఈ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహమేంటన్నదే ఇప్పుడు అసలు చర్చ. కృష్ణదాస్ సోదరుడి కుమారుడు రాం మనోహర్ నాయుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలనే ప్రయత్నమా? లేక ధర్మాన కుటుంబం వారస రాజకీయాలకు ప్లాన్ వేస్తోందా? ఇప్పటికే కృష్ణదాస్ కుమారుడు నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా, ప్రసాదరావు కుమారుడు ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దశాబ్దాలుగా జిల్లాలో ఆధిపత్యం చూపుతున్న కింజరాపు కుటుంబానికి ధీటుగా ధర్మాన కుటుంబం కూడా తన తదుపరి తరం కోసం రంగం సిద్ధం చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంత? తమ్మినెని నిజంగానే సైడ్ అవుతారా? లేక చివరికి హైకమాండ్ తీసుకునే నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తుందా? శ్రీకాకుళం ఎంపీ సీటు చుట్టూ రాజకీయ రగడ మాత్రం ఇప్పుడే పీక్‌కి చేరుతోంది… ఇక ముందు మరింత మాస్ ట్విస్టులు తప్పవన్న మాట!

మరింత సమాచారం తెలుసుకోండి: