రారాగా ప్రసిద్ధుడైన రాచమల్లు రామచంద్రారెడ్డి (ఫిబ్రవరి 28, 1922 - నవంబరు 25, 1988) బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశాడు. ఆయన రాసిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం 'సారస్వత వివేచన'. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకునిగా ఆరేళ్ళు పనిచేసి ఎన్నో విలువైన గ్రంథాలను అనువదించాడు. కడప నుంచి 1968 - 1970 ల మధ్య వెలువడిన 'సంవేదన' త్రైమాసిక పత్రిక సంపాదకుడిగా తెలుగు సాహిత్య విమర్శకు ఒరవడి దిద్దాడు.


1959 - 1963 మధ్యకాలంలో కడప నుంచే 'సవ్యసాచి' అనే రాజకీయ పక్ష పత్రిక కూడా నడిపాడు. చలం, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.), మహీధర రామమోహనరావు లాంటి రచయితలపై ఆయన చేసిన మూల్యాంకనం లోతైనది. ఆయన వాదోపవాదాల్లో దిట్ట. ఆయన్ను శ్రీశ్రీ 'క్రూరుడైన విమర్శకుడు' అన్నా నిజజీవితంలో రారా చాలా స్నేహశీలి.వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం గ్రామంలో 1922, ఫిబ్రవరి 28 న జన్మించాడు. తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, భయపు రెడ్డి. రారా వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని డిస్ట్రిక్ట్ బోర్డు హైస్కూల్లో చదువుకున్నాడు.


రారా మార్క్సిజాన్ని సాహిత్యానికి అన్వయించి సాహిత్యానికున్న శక్తిని - సమాజాన్ని మార్చే శక్తిని విశదీకరించాడు. రాసినవి ఎక్కువ భాగం సమీక్షలే ఐనా గొప్ప విమర్శకుడిగా పేరు పొందాడు. పుస్తక సమీక్షలను ప్రామాణికమైన విమర్శవ్యాసాలుగా రూపొందించడం ఆయన ప్రత్యేకత. గియోర్గి లూకాచ్ అనే హంగేరియన్ సౌందర్య శాస్త్రవేత్త 'చారిత్రక నవల' అనే గ్రంథంలో చేసిన సూత్రీకరణల ఆధారంగా కొల్లాయి గట్టితేనేమి నవలను సమీక్షించాడు రారా. తెలుగులో ఇలాంటి విమర్శ అంతకు ముందు రాలేదు.1944లో రారా విజయవాడనుంచి వెలువడే 'విశాలాంధ్ర దినపత్రికలో ఉపసంపాదకుడుగా చేరాడు. కానీ అక్కడ ఎక్కువ కాలం ఇమడలేక పోయాడు. తర్వాత కొండాపురం (వైఎస్ఆర్ జిల్లా)లో మకాం పెట్టి ఎర్రగడ్డ (ఉల్లిపాయ)ల వ్యాపారం చేశాడు. 1950ల నుంచి మార్క్సిజమ్ పట్ల మొగ్గు ఏర్పడింది. చివరిదశలో ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడిన రారా 1988, నవంబరు 25 న కన్నుమూశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: