
ఉపవాసానికి ముందు రోజు పుష్కలంగా నీరు తాగాలి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇది సహాయపడుతుంది. ఉపవాసం చేసేటప్పుడు నీరు తాగడం మానేయకూడదు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. వీలైతే కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, మజ్జిగ తాగవచ్చు. ఇది శక్తిని అందించి, నీరసం రాకుండా కాపాడుతుంది.
పూర్తిగా ఉపవాసం చేయలేని వారు పండ్లను, డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవచ్చు. అరటిపండు, యాపిల్, దానిమ్మ, ఖర్జూరం వంటి పండ్లు శక్తిని ఇస్తాయి. నానబెట్టిన బాదం పప్పులు తినడం కూడా మంచిది. ఉపవాసం చేసేటప్పుడు కష్టమైన పనులు, ఎక్కువ శారీరక శ్రమను చేయకూడదు. వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి.
ఉపవాసం కేవలం భౌతికమైనది కాదు, మానసికమైనది కూడా. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలను దూరంగా ఉంచాలి. గణపతిని స్మరించుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో గడపడం ఉత్తమం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మందులు వాడేవారు ఉపవాసం చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. వైద్యులు సూచించిన విధంగా మందులను తీసుకోవాలి, ఉపవాసం వల్ల మందుల ప్రభావం మారకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి ఉపవాసం చేస్తే, ఆధ్యాత్మికంగా, శారీరకంగా పూర్తి ప్రయోజనం పొందవచ్చు. వినాయక చవితి రోజున విఘ్నేశ్వడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందడంతో పాటు దేవుని అనుగ్రహం కూడా మనపై ఉంటుందని చెప్పవచ్చు.