గత ఏడాది వరకు 8 జట్లతో జరిగిన ఐపీఎల్ లీగ్ ఈ ఏడాది నుండి 10 జట్లతో జరగనుంది. కాబట్టి ఈ ఏడాది ఐపీఎల్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తి పెరుగుతుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ కోసం జరగనున్న మెగవేలం కోసం అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. కానీ... వేలం నిర్వ‌హించ‌డానికి ముందే ఈ సారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన కొత్త జ‌ట్లు ల‌క్నో, అహ్మ‌దాబాద్ ముగ్గేరేసి చొప్పున వేలంలో ఉన్న ఆట‌గాళ్ల‌ను ఎంచుకోవ‌డానికి బీసీసీఐ అవ‌కాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 31 వ‌ర‌కు ముగ్గురేసి చొప్పున ఆట‌గాళ్ల‌ను ఎంచుకోవాల‌ని అహ్మ‌దాబాద్‌, ల‌క్నో జ‌ట్ల‌కు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ల‌క్నో, అహ్మ‌దాబాద్ జ‌ట్లు త‌మ రిటైన్ ఆట‌గాళ్ల జాబితా పూర్తి చేస్తే వేలం కోసం ఒక తేదీని ఖ‌రారు చేసే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉందట‌. అయితే మిగ‌తా 8 జ‌ట్లు ఇప్ప‌టికే త‌మ రిటెన్ష‌న్ జాబితాను బీసీసీఐకి స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో బెంగ‌ళూరు వేదిక‌గా ఐపీఎల్ మెగా వేలం జరగనున్నట్లు తెలుస్తుంది. సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ ఇప్ప‌టికే త‌మ‌ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ను నియ‌మించిన‌ట్టు ప్ర‌క‌టించింది. ఇక‌ అహ్మదాబాద్ తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, కోచ్‌గా ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు దేశంలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై సందేహాలు నెల‌కొన్నాయి. దాంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు నెలకొంటే లీగ్‌ను విదేశాల‌కు త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. వీలైనంత వ‌ర‌కు లీగ్‌ను ఇండియాలోనే నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తోంద‌ని... కానీ క‌రోనా కేసులు ఇలాగే పెరిగితే లీగ్‌ను ఒక‌టి లేదా రెండు వేదిక‌ల్లోనే నిర్వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం. అలాగే మ్యాచ్‌ల‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌డం కూడా కష్టమే అనేది అర్ధం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ipl