దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో బాంబు బెదిరింపులకు సంబంధించిన ఫోన్ కాల్స్ కలకలకం రేకెత్తించాయి. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్‌బచ్చన్ నివాసంతోపాటు దాదర్ రైల్వేస్టేషన్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, బైకుల్లా రైల్వేస్టేషన్లకు కూడా బాంబులు అమర్చినట్లు కాల్స్ వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీల అనంతరం అనుమానస్పద వస్తువేలవీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అమితాబ్ ఇంటివద్ద, రైల్వేస్టేషన్లవద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి అమితాబ్‌బచ్చన్ నివాసంతోపాటు రైల్వేస్టేషన్లవద్ద బాంబులు అమర్చినట్లు చెప్పాడు. వెంటనే స్పందించిన అధికారులు ఇతర సిబ్బందిని అప్రమత్తంచేశారు. ఆర్‌పీఎఫ్, రైల్వే పోలీసులు, జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ సాయంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలుకానీ, ఇతర అనుమానస్పద వస్తువులుకానీ ఏవీ కనపడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి