గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి తన రూపాంతరాన్ని మార్చుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ వస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. దేశంలో కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో గత కొంతకాలంగా కరోనా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతుండటంతో మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లే కనిపిస్తుందని తెలిపారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 10.67లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 34,113 మందికి పాజిటివ్‌ వచ్చింది.


ఇక శనివారంతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 10వేలకు పైగా తగ్గాయని అన్నారు. అంతేకాక.. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 3.19 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. ఇక ఇదే తరుణంలో మరణాల రేటు కూడా సగానికి తగ్గడం సానుకూలాంశంగా కనిపిస్తోంది. క్రితం రోజు 680కి పైనే మరణాలు నమోదవ్వగా.. తాజాగా ఆ సంఖ్య 346కు తగ్గినట్లు పేర్కొన్నారు. కాగా..దేశంలోకి కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 5,09,011 మంది ప్రాణాలు కోల్పోయారు.


అయితే గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 91,930 మంది వైరస్‌ బారి నుండి కోలుకున్నారు. ఇక రికవరీ రేటు 97.68శాతానికి పెరిగినట్లు తెలిపారు. అంతేకాక.. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో  దేశంలో క్రియాశీల కేసుల కొండ కూడా కరుగుతోందని చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,78,882 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 1.12శాతానికి తగ్గుముఖం పట్టింది.


ఇదిలా ఉండగా దేశంలో వ్యాక్సినేషన్‌ పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఇక ఆదివారం మరో 11.66లక్షల మందికి టీకాలు వేశారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు 172.95కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాగా.. 15-18 ఏళ్ల వయసు వారిలో 5.21కోట్ల మందికి తొలి డోసు పూర్తవ్వగా.. 1.50 కోట్ల మంది టీనేజర్లకు రెండు డోసుల టీకాను అందజేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకు 1.73 కోట్ల ప్రికాషనరీ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: