భారత వ్యాపార వాణిజ్య సంస్థలను మించి సాంకేతిక రంగం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. కరోనా క్రైసిస్ ని చేదించుకొంటూ భారత ఐటి దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీ ఎల్ విప్రోలు మార్కెట్ లో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దేశ గౌరవాన్ని ఇనుమడింప జేస్తున్నాయి. 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మరో ఘనతను సాధించింది. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్స్ లో మూడవ స్థానం దక్కించుకుంది. యాక్సెంచర్, ఐబీఎంలు, తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయని “బ్రాండ్ ఫైనాన్స్–2021” నివేదిక వెల్లడించింది. ఐటీ రంగంలో అంతర్జాతీయంగా టాప్–10లో భారత్ నుంచి టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్ సీఎల్ విప్రో చోటు దక్కించుకున్నాయి.

టీసీఎస్ బ్రాండ్ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్ డాలర్లు ఎగసి 14.9 బిలియన్ డాలర్లకు చేరింది. వృద్ధి పరంగా 25 ఐటీ కంపెనీల్లో ఇదే అత్యధికం. కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనమని టీసీఎస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్. రాజశ్రీ ఈ సందర్భంగా తెలిపారు.

ఐటీ కంపెనీలన్నిటి మొత్తం బ్రాండ్ విలువ 3 శాతం తగ్గితే, టీసీఎస్ సుమారు 11 శాతం వృద్ధి సాధించడం ఇక్కడ గమనార్హం. 2020 నాల్గవ త్రైమాసికంలో ఈ సంస్థ ఏకంగా 6.8 బిలియన్ డాలర్ల డీల్స్ చేజిక్కించు కోవడంతో బలమైన ఆదాయం నమోదు చేసింది.

ఐటీరంగంలో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం గరిష్ట స్థాయిని తాకింది.

సంస్థలో ప్రస్తుతం 469000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచంలో అత్యంత విలువైన బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్ గా యాక్సెంచర్ తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ బ్రాండ్ వాల్యూ 26 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండవ స్థానాన్ని పదిలపర్చుకున్న ఐబీఎం బ్రాండ్ విలువ 16.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక కాగ్నిజెంట్ ను దాటి నాల్గవ స్థానానికి ఇన్ఫోసిస్ ఎగబాకింది. ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 19 శాతం అధికమై 8.4 బిలియన్ డాలర్లుగా ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: