ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే అత్యంత కోటీశ్వ‌రుడు ఎవ‌రంటే ఎవ‌రికైనా ట‌క్కున గుర్తొచ్చే పేరు ఎలాన్ మ‌స్క్‌. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ టెస్లాకు సీఈవో అత‌డు. జూలై 2003లో అమెరికాలో ఏర్పాటైన ఈ సంస్థ కేవ‌లం రెండు ద‌శాబ్దాల కంటే త‌క్కువ కాలంలో ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒక‌టిగా ఎదుగుతుంద‌న్న‌ది అప్ప‌ట్లో ఎవ‌రి ఊహ‌కూ అంద‌ని విష‌యం. ఒక వ్యాపార ప్ర‌యోగంగా మాత్ర‌మే దీనిని చాలామంది చూశారు. 2004లో దీని చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎలాన్ మ‌స్క్ సైతం ఈ కంపెనీ విజ‌యావ‌కాశాలు 10 శాతం మాత్ర‌మేన‌ని అప్ప‌ట్లో వ్యాఖ్యానించారు. అయితే ప‌రిస్థితుల‌ను త‌న‌క‌నుకూలంగా మ‌ల‌చుకుంటూ, అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను వినియోగించుకుంటూ ఆ కంపెనీని విజ‌యాల బాట ప‌ట్టించేందుకు ఎలాన్‌ మ‌స్క్ చేసిన కృషి మాత్రం అసామాన్యమ‌నే చెప్పాలి. అదే ఈ సంస్థ‌ను అతి తక్కువ కాలంలోనే ప్ర‌పంచంలోని మేటి సంస్థ‌ల్లో ఒక‌టిగా తీర్చిదిద్దింది.

         ఈ ఏడాది అమెరికా చ‌రిత్ర‌లోనే ఎవ‌రూ క‌ట్ట‌నంత ప‌న్నును తాను క‌ట్ట‌బోతున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌టన చేసి ఎలాన్ మ‌స్క్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. తాను వాస్త‌విక ఆదాయానికి త‌గిన‌ట్టుగా పన్ను చెల్లించ‌డం లేదంటూ డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన ఒక సెనేట‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు బ‌దులుగా ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఇంత‌కీ ఎలాన్‌ మ‌స్క్ కట్ట‌బోయే ప‌న్ను ఎంతో తెలుసా ఏకంగా 11 బిలియ‌న్ డాల‌ర్ల‌ట‌. మ‌న రూపాయ‌ల్లో చూస్తే ఈ మొత్తం 83 వేల కోట్ల‌కు పైమాటేన‌న్న‌మాట‌. గ‌త ఏడాది మార్చిలో ఈ సంస్థ నుంచి ప‌ది ల‌క్ష‌ల‌వ కార్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఏడాది మొద‌టి ఎనిమిది నెల‌ల్లోనే 4,73,136 కార్ల‌ను ఉత్ప‌త్తి చేసింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి రెండు క్వార్ట‌ర్ల‌కు క‌లిపి ఈ సంస్థ ఆదాయం 22.35 బిలియ‌న్ డాలర్లు. 2020 ఏడాది మొత్తానికి ఇది 31.54 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. నిక‌ర లాభం విష‌యంలోనూ ఈ సంస్థ మిగిలిన సంస్థ‌ల‌కు అంద‌నంత దూరంలో ఉంది. ప్ర‌స్తుతం క్వార్ట‌ర్‌కు 2 ల‌క్ష‌ల వాహ‌నాల‌ను ఉత్ప‌త్తి చేస్తూ త‌న మార్కెట్ ను స్థిరంగా పెంచుకుంటూ వెళుతోంది. అమెరికా, జ‌ర్మ‌నీ, చైనాల్లో క‌లిపి ఈ సంస్థ‌కు మొత్తం 6 ఉత్ప‌త్తి కేంద్రాలున్న ఈ సంస్థ షేరు ఈ ఏడాది న‌వంబ‌ర్ 4న 1230 డాల‌ర్ల‌ను క్రాస్ చేయ‌డంతో కంపెనీ మార్కెట్ విలువ ఇప్ప‌టికే ట్రిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటిపోయింది. కాగా కొన్నివారాలుగా ఎలాన్ మ‌స్క్ కంపెనీలో త‌న షేర్ల‌ను మార్కెట్‌లో విక్ర‌యిస్తూ వ‌స్తున్నారు. ఈ నిధుల‌ను ఆయ‌న ప్ర‌పంచంలో పేద‌రిక నిర్మూల‌న‌కు డొనేట్ చేయ‌వ‌చ్చ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: