సైబర్‌ నేరగాళ్లు ఎప్పుడు కూడా ఏదో రకంగా తమకు అమాయకులను మోసం చేసి దోచుకుంటున్నారు. అందుకు కొత్త కొత్త యాప్‌లతో ఎప్పటికప్పుడు కొత్తరకం మోసాలకు దిగుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఇరుక్కుపోవాల్సిందే. ప్రతిదానికి బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు నిర్వహించే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌, డిజిటల్‌ మయంగా మారింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్లుగానే మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైనా దుకాణాలలోకి వచ్చి వస్తువులు కొనుగోలు చేసి అందుకు సంబంధించి క్యూఆర్‌కోడ్‌ యాప్‌తో డబ్బులు స్కాన్‌ చేసి చెల్లిస్తారు. ఇక్కడ స్కాన్‌ డబ్బులు పంపిన వారి మొబైల్‌ సెండింగ్‌ మనీ సక్సెస్‌ చూపిస్తుంది. అయితే ఇక్కడే మనం జాగ్రత్తగా లేకపోతే అది మన అకౌంట్‌లో జమ కాదు. ఎందుకంటే వారు వాడేది ఫేక్‌ యూపీఐ. తాజాగా ఇలాంటి మోసాలు కడప నగరంలో చోటుచేసుకున్నాయి.అవేంటో తెలుసుకొని జాగ్రత్త పడదాం.


కడపలో వైవీ స్ర్టీట్‌లోని ఓ దుకాణంలో సైబర్‌ నేరగాళ్లు రూ.12 వేలకు కొనుగోలు చేశారు. ఆ వస్తువులకు సంబంధించి క్యూఆర్‌ స్కానర్‌ ద్వారా రూ.12 వేలు ఆ వ్యాపారికి ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు చూపించారు. అది నమ్మిన వ్యాపారి తన అకౌంట్‌లో జమ అయినట్లు భావించాడు. అయితే ఆ వ్యాపారికి ఇప్పటికి డబ్బులు చేరినట్లు మెసేజ్‌ రాలేదు. దీంతో అకౌంట్‌లో పరిశీలించగా డబ్బులు అందకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


అలాగే కడపలో అక్కాయపల్లెలో ఓ సైబర్‌ నేరగాడు కిరాణాషాపులోకి వెళ్లి రూ.5 వేల విలువ చేసే వస్తువులు కొనుగోలు చేశాడు. నకిలీ యాప్‌తో అక్కడ ఉన్న స్కానర్‌ ద్వారా డబ్బులు చెల్లించినట్లు, తన ఫోన్‌ నుంచి డబ్బులు విజయవంతంగా పంపినట్లు మెసేజన్‌ను చూపించాడు. ఆ వ్యాపారి కూడా తన అకౌంట్‌లో డబ్బు పడి ఉంటుందిలే అనుకున్నాడు. అయితే వ్యాపారి తన ఖాతాను పరిశీలించగా డబ్బులు అకౌంట్‌కు రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. చిన్న చిన్న నగదు మోసాలు కావడంతో కొంతమంది వదిలేస్తున్నారు. పెద్ద మొత్తంలో పోయిన వారు మాత్రం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.


కొందరు సైబర్‌ నేరగాళ్లు దుకాణాలు, ఏటీఎంల వద్ద తచ్చాడుతూ ఉంటారు. అక్కడకు వచ్చే కస్టమర్లతో మాటలు కలిపి తాము ఏటీఎం కార్డు మరిచిపోయామని, నగదు ఇస్తే ఫోన్‌పే ద్వారా డబ్బు పంపుతామని చెబుతారు. క్యాష్‌ తీసుకుని ఫేక్‌ యాప్‌ ద్వారా డబ్బు పంపుతారు. వారి మొబైల్‌లో సెండ్‌ అయినట్టు చూపుతుంది. బాధితుల అకౌంట్‌కు మాత్రం డబ్బు రాదు. అప్పటికే మోసగాళ్లు అక్కడి నుంచి ఉడాయించి ఉంటారు. ఏది ఏమైనా తగు జాగ్రత్తలు పాటించకపోతే సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి బాధితులుగా మిగలాల్సి వస్తుంది.సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్కాన్‌ చేసి సక్సెస్‌ఫుల్‌ చూపినా అమౌంట్‌ వచ్చిందా లేదా అని వ్యాపారులు పరిశీలించాలి. తొందరలో నిర్లక్ష్యం వహిస్తే సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. కొత్త కొత్త యాప్‌లు మెసేజ్‌ లింకులతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.అలాంటివి వస్తే ఖచ్చితంగా అవాయిడ్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: