ఇపుడిదే విషయం ఎవరికీ అర్ధం కావటం లేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ పథకం ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీరివ్వాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయగానే తెలంగాణా సిఎం కేసీయార్ ఏపి ప్రభుత్వంపై మండిపోతున్నాడు. ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తు కోర్టులో కేసు కూడా వేస్తానంటూ హెచ్చరించాడు. సరే ప్రతిపక్షాలు కూడా కేసీయార్ కే మద్దతుగా నిలబడ్డాయి.

 

సరే తెలంగాణా కోణంలో కేసీయార్, ప్రతిపక్షాల వాదన బాగానే ఉంది. మరి ఏపిలో ప్రతిపక్షాల మాటేమిటి ?  తెలంగాణాలో ప్రతిపక్షాలు కేసీయార్ కు మద్దతుగా నిలబడినపుడు ఏపిలో ప్రతిపక్షాలు కూడా జగన్ కు మద్దతుగా నిలబడాలి కదా ?   తెలంగాణాలో పాలక+ప్రతిపక్షాలన్నీ కలిసి జగన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ఏపిలో ప్రతిపక్షాలు చోద్యం చూస్తున్నాయి. ఒక్క బిజెపి మాత్రమే జగన్ కు మద్దతుగా నిలబడింది. మిగిలిన ప్రతిపక్షాలు కూడా జగన్ కు మద్దతుగా నిలబడాలన్న బిజెపి పిలుపును పట్టించుకోలేదు.

 

ఇక్కడే అందరికీ రెండు అనుమానాలు వస్తున్నాయి. మొదటిదేమో ప్రతిపక్షాల కోపం జగన్ మీదా ? లేకపోతే రాయలసీమ ప్రాంతం మీదా ? అలాగే రాయలసీమ, నెల్లూరు+ప్రకాశం జిల్లాల్లో తాగు, సాగు నీరందించే ఈ ప్రాజెక్టు విస్తరణ మీద ప్రతిపక్షాలకు ఎందుకంత మంట ?  అన్నదే జనాలకు అర్ధం కావటం లేదు.  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు ద్వారా పై ఆరు జిల్లాలకు నీరందించటం వల్ల తెలంగాణాకు ఎటువంటి నష్టం జరగదని ఒకవైపు ప్రభుత్వం మొత్తుకుంటున్నా ఇటు తెలంగాణాలో రాజకీయ పార్టీలు పట్టించుకోవటం లేదు.

 

సరే తెలంగాణా యాంగిల్లో పార్టీలు యాగీ చేస్తున్నాయంటే అర్ధముంది. మరి ఏపిలోని ప్రతిపక్షాలకు ఏమి వచ్చింది ? ప్రభుత్వ వాదనకు  ఎందుకు మద్దతివ్వటం లేదు ?  అంటే జగన్ అనుకున్నది అనుకున్నట్లు చేస్తే వైసిపికి మంచి పేరొస్తుంది కానీ తమకు ఏమి వస్తుందనే స్వార్ధమే మిగిలిన ప్రతిపక్షాల్లో ఉందా ? అనే అనుమానం పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ అనుకున్నది అనుకున్నట్లు చేసినా చేయలేకపోయినా ప్రతిపక్షాలైతే బలపడే ఛాన్సే లేదు.

 

రాయలసీమ ప్రాంతం, ప్రజలపైన ప్రతిపక్షాలకున్న వ్యతిరేకత బయటపడటం వల్ల ఇంకా ఆ పార్టీలు నష్టపోతాయే కానీ లాభపడే అవకాశమే లేదు. కనీసం జగన్ కు మద్దతుగా నిలబడితే రేపటి ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతం కోసం తెలంగాణాతో తాము కూడా పోరాటాలు చేశామని చెప్పుకునే అవకాశమైనా ఉంటుంది కనీసం.  ఏమిటో రాను రాను రాజకీయ పార్టీల ఆలోచనలు మరీ సంకుచితమైపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: