మంగళవారం ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.. ఈ సమయంలో అనేక రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. అయితే ఈ సందర్భంగా మోడీ జగన్ కు ఓ ఆఫర్ ఇచ్చినట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బీజేపీ వైసీపీ మధ్య బంధం విచిత్రంగా ఉంది. పూర్తి స్థాయిలో బీజేపీని వైసీపీ సపోర్టు చేస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. అలాగని.. వైసీపీ ఏమీ టీఆర్‌ఎస్‌ లాగా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకోవడం లేదు. అంతే కాదు.. పార్లమెంటులో ప్రతి బిల్లుల విషయంలోనూ బీజేపీకి వైసీపీ సపోర్టు చేస్తూనే ఉంది.

ఆ విధంగా చూస్తే వైసీపీ బీజేపీ మిత్ర పక్షంగానే చెప్పుకోవాలి. కానీ ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం కానీ.. ఎన్డీఏలో చేరడం కానీ చేయడం లేదు. త్వరలో వైసీపీ ఎన్డీఏలో చేరొచ్చనే ఊహాగానాలు కూడా జోరుగానే వినిపిస్తున్నా.. అదీ అంత సులభమైన విషయమేమీ కాదు.. అయితే రెండు పార్టీల మధ్య చెప్పుకోదగ్గ అవగాహన ఉంది. ఒకరి అవసరం మరొకరకి కచ్చితంగా ఉంది. ఓవైపు మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా బీజేపీని వదిలి వెళ్తున్న సమయంలో వైసీపీ బీజేపీకి ఓ మిత్రుడుగా కనిపిస్తోంది.

అటు జగన్‌ కు కూడా కేంద్రం అండ  అన్ని విధాలా అవసరమే. అందుకే మధ్యే మార్గంగా నరేంద్రమోడీ జగన్‌కు ఓ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే..  లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి కట్టబెట్టడం.. 25 మే 2019 వరకు అన్నాడీఎంకేకు చెందిన తంబి దురై డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత మళ్లీ ఆ పోస్టును భర్తీ చేయనే లేదు. మళ్లీ అన్నాడీఎంకేకు మళ్లీ ఆ పోస్టు ఇచ్చే ఉద్దేశం బీజేపీకి ఉన్నట్టు కనిపించడం లేదు.

ఇప్పుడు ఆ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇస్తామని మోడీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీ ఎలాగూ మిత్రపక్షం కాకపోయినా శత్రుపక్షం కాదు కదా.. పైగా రెండు సభల్లోనూ వైసీపీ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. అందుకే కేబినెట్‌లో చేరకపోతే డిప్యూటీ స్పీకర్ పోస్టు అయినా తీసుకోవాలని మోడీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనిపై జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: