
ప్రజాకోర్టులో తన పప్పులుడకవని బాగా అర్ధమైనట్లుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కోర్టుల్లో కేసులు వేయాలని, పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టి కోర్టుకు లాగాలని పదే పదే నేతలకు, కార్యకర్తలకు పిలుపిచ్చారు. గురువారం ప్రారంభమైన రెండు రోజుల డిజిటల్ మహానాడులో మాట్లాడుతు టీడీపీ నేతలపై ప్రభుత్వం పెట్టిన కేసుల వివరాలను చదివి వినిపించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రబాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ లాంటి నేతలందరినీ జగన్ ప్రభుత్వం కేసులు పెట్టడం ద్వారా వేధిస్తున్నట్లు మండిపోయారు. అధికారంలో ఉన్నపుడు అన్నీ విధాలుగా చెలరేగిపోయిన నేతలు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే రెచ్చిపోయారు. దాంతో కేసుల్లో తగులుకుంటున్నారు.
చంద్రబాబు చదివిన నేతలపై ప్రభుత్వం ఒక్క తప్పుడు కేసు కూడా పెట్టలేదు. ఇఎస్ఐ స్కాంలో ఇరుక్కున్నందునే అచ్చెన్నాయుడుపై ప్రభుత్వం కేసుపెట్టి అరెస్టు చేసింది. హత్యకేసులో పాత్ర ఉందన్న ఆరోపణలపైనే కొల్లు రవీంద్రపై కేసు పెట్టి అరెస్టుచేసింది. ట్రావెల్స్ ముసుగులో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అక్రమాలు, అరాచకాలు, ఫోర్జరీ సంతకాల ఇన్సూరెన్స్ వ్యవహారాలన్నీ ఆధారాలతో సహా బయటపడిన తర్వాతే అరెస్టుచేసింది. ఇక చింతమనేని ప్రభాకర్ అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. విచిత్రమేమిటంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే చింతమనేనిపై చాలా కేసులు నమోదయ్యాయి. కాకపోతే అధికార పార్టీ ఎంఎల్ఏ కాబట్టి యాక్షన్ తీసుకోలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చింతమనేని వ్యవహారశైలి మారకపోవటంతోనే అరెస్టులు జరిగాయి.
పనిలోపనిగా వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు వివాదాన్ని కూడా ప్రస్తావించారు. నిజానికి ఎంపి విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరమే చంద్రబాబుకు లేదు. ఎందుకంటే రఘురామ వివాదంతో టీడీపీకి ఎలాంటి సంబంధంలేదు. ఎంపిపై ప్రభుత్వం కేసు పెట్టిందంటే అది అధికారపార్టీ అంతర్గత వ్యవహారం. ఎంతసేపు ఎంపిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని చెబుతున్నారే కానీ జగన్ పై ఎంపి చేసిన వ్యక్తిగత దూషణల గురించి మాత్రం మాట్లాడటంలేదు. ఏదేమైనా ప్రజాకోర్టులో జగన్ను ఎదుర్కోవటం కష్టమని చంద్రబాబుకు బాగా అర్ధమైపోయినట్లుంది. అందుకనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయాలని నేతలు, కార్యకర్తలకు పిలుపిచ్చారు.