ఏపీ సీఎం జగన తన మూలాలు తానే దెబ్బ తీసుకుంటున్నారా.. ఆయన తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారా.. తన శత్రువులను తానే పెంచుకుంటున్నారా.. జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలు చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇటీవల కొన్ని జిల్లాల్లో సర్పంచ్‌లు జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. విచిత్రం ఏంటంటే.. అలా విరుచుకుపడుతున్న వారిలో వైసీపీ సర్పంచ్‌లే ఎక్కువగా ఉన్నారు. వారి ఆందోళనకు కారణం ఏంటంటే.. కేంద్రం పంచాయతీలకు ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు దక్కకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కడప జిల్లాలోని ఏకంగా 20 మంది వరకూ వైసీపీ సర్పంచ్‌లు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారట. ఏ పార్టీకైనా బలం గ్రామాల్లోనే ఉంటుంది. పార్టీ మూలాలు అక్కడే ఉంటాయి. దీనికి తోడు జగన్ సర్కారు ఎక్కువగా సంక్షేమ పథకాలపై ఆధాపపడి ఉంది. ఎన్నికల్లో తమను అవే గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉంది. మరి అలాంటి సంక్షేమ పథకాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నది గ్రామీణులే. అలాంటి గ్రామాల్లో జగన్ సర్కారు చర్యల మూలంగా వ్యతిరేకత వస్తే అది పార్టీకే చేటు తెస్తుంది. పార్టీ మూలలనే దెబ్బ తీస్తుంది.


తెలుగు దేశం నాయకులు కూడా ఈ విషయంపై సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా వైకాపా మద్దతుదారులే సర్పంచులుగా ఉన్నారన్న విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. పంచాయతీ వ్యవస్థను జగన్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని.. ఇది ఆ పార్టీకి పెద్ద మైనస్ అవుతుందని టీడీపీ అంచనా వేసుకుంటోంది. ఇలాంటి జగన్ చర్యలపై పోరాటం చేయడం ద్వారా గ్రామాల్లో బంల పెంచుకోవాలని తెలుగు దేశం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులు..... తెలుగుదేశం కార్యాలయంలో చంద్రబాబును కలిసి సమస్యలు చెప్పుకున్నారు. 73వ రాజ్యాంగ సవరణలో పంచాయతీలకు ప్రత్యేక అధికారాలిచ్చారని సర్పంచ్‌లు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యంగం ఇచ్చిన హక్కులను కూడా కాలరాస్తోందని వారు అంటున్నారు. ఈ విషయాన్ని జగన్ సర్కారు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటే బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: