తెలంగాణ సీఎం కేసీఆర్ మరో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ 1 వంటి  కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు శిక్షణనిచ్చేందుకు ప్రత్యేకంగా ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపరిచేలా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.


ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా దేశ వ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఈ సెంటర్లలో ఉద్యోగ శిక్షణను అందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి  ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.  


అలాగే.. పదో తరగతి వరకు విద్యనందిస్తున్నరాష్ట్రంలోని అన్నిగురుకుల పాఠశాలల్లో ఇంటర్మిడియేట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌  నిర్ణయించారు. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఐటిఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ కోర్సులను పూర్తి చేసుకున్నయువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలని సీఎం కేసీఆర్‌  ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా ఇవి మారాలని సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr