దేశ వ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వచ్చేశాయి. వీటిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఉన్నాయి. ఒక్క తెలంగాణను పక్కన పెడితే మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ సంపూర్ణ విజయం సాధించింది. ఇక్కడ కమల వికాసం కనిపించింది. గతానికి భిన్నంగా.. ఆపార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కనివినీ ఎరుగని రీతిలో ఆపార్టీ మేజిక్ ఫిగర్ ను అవలీలగా దాటింది.


మధ్యప్రదేశ్ లో 137, రాజస్థాన్ లో 117, ఛత్తీస్ గఢ్ లో 47 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఇవి మ్యాజిక్ ఫిగర్ కు చాలా ఎక్కువ. అయితే మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గంపగుత్తుగా ప్రధాని మోదీ ఖాతాలోనే పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై ఆయా రాష్ట్రాల్లో మోదీ ప్రచారం చేశారు. రాజస్థాన్ లో అత్యధికంగా 18 సార్లు, మధ్యప్రదేశ్ లో 10 సార్లు, ఛత్తీస్ గఢ్ లో ఎనిమిది సార్లు మోదీ ప్రచారం చేశారు.


దక్షిణ భారత దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేని కమలం పార్టీ ఉత్తర భారత దేశంలో మాత్రం అజేయ శక్తిగా మారింది. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో మోదీ సారథ్యంలోని ఆ పార్టీని ఓడించడం కాంగ్రెస్ కు అంత సులభం కాదని ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా అవగతమవుతుంది. సార్వత్రికానికి సెమీ ఫైనల్ గా భావించే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కమల నాథులకు జోష్ ఇవ్వనుండగా ఇండియా కూటమికి మాత్రం ముఖ్యంగా కాంగ్రెస్ కు ఇవి  చేదు ఫలితాలే.


అయితే ఈ మూడు రాష్ట్రాల ఫలితాలతో మోదీ హవా మరింత పెరగనుంది. ఆయన ఆదరణకు తిరుగులేదని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఇది బీజేపీ గెలుపుకంటే మోదీ హవా అనవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: