రాజకీయాలంటే ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు. అయితే ఈ రాజకీయాల్లో కొన్ని అపురూపమైన స్నేహాలు కూడా ఉంటాయి. మరికొన్ని స్నేహాలు.. బయటకు కనిపించవు.. అలాంటి స్నేహమే శ్రీకాకుళం జిల్లాలోని ధర్మాన, కింజారపు కుటుంబాల మధ్య కొనసాగుతోంది. కింజారపు కుటుంబం నుంచి రెండు తరాలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక పాత్ర పోషించారు. ఎంపీగా పలుసార్లు ఎన్నికై హస్తిన స్థాయిలో చక్రం తిప్పారు.


ఇక ఆయన హఠాన్మరణం తర్వాత ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు.. కుమారుడు రామ్మోహన్‌నాయుడు ప్రస్తుతం టీడీపీలో మంచిస్థానాల్లో ఉన్నారు. అయితే.. ధర్మాన కుటుంబం మాత్రం మొదట్లో కాంగ్రెస్‌లోనూ.. ఆ తర్వాత వైసీపీ స్థాపించిన తర్వాత ఆ పార్టీలోనూ కొనసాగుతున్నారు. ఈ కుటుంబం నుంచి ధర్మాన ప్రసాదరావు, ఆయన తమ్ముడు ధర్మాన కృష్ణదాసు వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రాజకీయ వైరం ఉన్న కుటుంబాలుగా ఈ రెండు కుటుంబాలు కనిపిస్తాయి కానీ.. రెండు కుటుంబాల మధ్య అంతర్గతంలో మంచి స్నేహం ఉంది.


ధర్మాన, కింజారపు .. ఈ రెండు ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు. ఆ సామాజిక వర్గ స్నేహం అంతర్గతంలో కొనసాగుతూనే ఉంది. అందుకే.. ఎర్రన్నాయుడు ఉన్నరోజుల్లో ఆయన ఎంపీగా ఎన్నికయ్యేందుకు ధర్మాన లోపాయకారీగా సహకరించేవారని చెబుతారు. అటు ఎర్రన్నాయుడు కూడా  ఎమ్మెల్యేగా ధర్మాన విజయానికి పరోక్షంగా సహకరించేవారంటారు. వీరి స్నేహబంధాన్ని తెలిపేందుకు అనేక రాజకీయ ఘటనలు కూడా చెప్పుకోవచ్చు.


1999 టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినా ఆ సమయంలో నరసన్నపేటలో కాంగ్రెస్‌ తరపున  ధర్మాన ప్రసాదరావే గెలిచారు. అలాగే 2004లో కాంగ్రెస్‌ ప్రభంజనం ఉన్నా.. ఎంపీగా ఎర్రన్నాయుడే గెలిచారు. అలాగే గత లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఓ సునామీలా రాష్ట్రమంతా చుట్టేసినా శ్రీకాకుళంలో మాత్రం ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌ నాయుడే గెలిచారు. ఇందులో ధర్మాన పాత్ర ఉందని చెబుతారు. అలాగే ఈ రెండు కుటుంబాల నేతలు పరస్పరం విమర్శించుకున్న సందర్భాలు కూడా తక్కువనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: