తెలంగాణ నిరుద్యోగులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్.  ఆమధ్య కేసీఆర్ 80 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అధికారులంతా అదే పనిలో ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఒక్కో ఫైల్ క్లియర్ చేస్తోంది. తాజాగా మరో 3,334 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఎక్సైజ్‌, అటవీ, అగ్నిమాపక శాఖల్లో నియామకాలకు పచ్చజెండా ఊపేసింది. ఆర్థిక శాఖ ఈ మేరకు నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 80,039  ఉద్యోగాల్లో తొలివిడతగా 30,453 నియామకాలకు ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.


ఇప్పుడు కొత్తగా 3,334 పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మొత్తం కలిపి అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య 33,787గా ఉంది. కొత్తగా యూనిఫామ్‌ సర్వీసు పోస్టులైన ఆబ్కారీ, అగ్నిమాపకం, అటవీ శాఖల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొన్న రాష్ట్ర మంత్రిమండలి ఈ పోస్టులకు ఆమోదం తెలపింది. ఆ వెంటనే ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులిచ్చింది. ఇదే మంత్రిమండలిలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ యూనిఫామ్‌ సర్వీసు పోస్టుల అర్హత వయోపరిమితిని మూడేళ్లు పెంచారు.


ఇప్పుడు ఆ  సడలింపునకు కూడా నిన్న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆబ్కారీ కానిస్టేబుళ్లు, అగ్నిమాపక పోస్టులను పోలీసు నియామక సంస్థ భర్తీ  చేస్తుంది. ఇక ఎక్సైజ్‌ శాఖలోని బెవరేజెస్‌ కార్పొరేషన్‌, మరికొన్ని పోస్టులు, అటవీ శాఖల పోస్టులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ భర్తీ చేస్తుంది.


ఇక ఇప్పటికే తెలంగాణ సర్కారు  గ్రూపు-1, పోలీసు తదితర ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలాఖరుకు ఈ నోటిఫికేషన్లు రావచ్చని చెబుతున్నారు. ఇకపై ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు ఇస్తామని.. ప్రభుత్వం చెబుతోంది. అభ్యర్థులు మాత్రం అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వస్తే.. ఇబ్బంది అవుతుందని.. ఈ మేరకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: