దాదాపు గత ఏడాది కాలంగా ప్రజలందరినీ భయంతో వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ కోసం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఫార్మా ప్రతినిధులు అలాగే వైద్య శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు జరిపి ఇప్పుడు వివిధ దశల్లో ప్రయోగాలు జరుపుకుంటున్నాయి. ఇప్పటికే అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ నెలకొంది. ఇక ఆస్ట్రేలియా దేశ కరోనా వ్యాక్సిన్ వల్ల కొన్ని సమస్యలు ఏర్పడటంతో ఆ వ్యాక్సిన్ నిలిపివేయబడింది. ఇక మన భారతదేశంలో అతి త్వరలోనే కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ అన్నారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకునేంత వరకు ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని దేశ ప్రజలను ఆయన వినయ పూర్వకంగా హెచ్చరించారు. సోమవారం (డిసెంబర్ 14) అంతర్జాతీయ కరోనా వైరస్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన ఈ కరోనా వ్యాక్సిన్ గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.



 ‘భారత్‌లో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. టీకా తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేంతవరకు, రెండో డోసు తీసుకునే వరకూ ఎవ్వరూ నిర్లక్ష్యం వహించవద్దు. ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా..’ అని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మరోవైపు.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలకు పంపిణీ చేసేందుకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఒక్కో విడతలో 100 మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తొలుత అత్యవసరం ఉన్న వారికి, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు, వైద్యులు, హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించనున్నారు. వ్యాక్సిన్‌ తీసుకుకోదలచిన వారు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన కో–విన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కేంద్రం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: