ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం హవా నడుస్తోంది. ఇంగ్లిష్ మీడియంలో చదివితే మాత్రమే ఉద్యోగాలు సాధించవచ్చని, కెరీర్ పరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని నిపుణులు సైతం  చెబుతున్న సంగతి తెలిసిందే.  తాజాగా వెలువడిన ఒక నివేదిక ద్వారా ఈ విషయాలు వెల్లడవుతున్నాయి.  రాబోయే రోజుల్లో తెలుగు మీడియం కనిపించదేమో అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ లో తెలుగు మీడియం చదువుతున్న విద్యార్థులు సంఖ్య కేవలం 4.8 శాతం  మాత్రమేనని తెలుస్తోంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.  తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థుల సంఖ్య ఊహించని స్థాయిలో తగ్గుతుండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతోంది.

ప్రైవేట్ స్కూల్స్ లో తెలుగు మీడియంలో చదివే విద్యార్థులు దాదాపుగా లేరనే చెప్పాలి.  తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న  విద్యార్థుల సంఖ్య  36 లక్షలు కాగా అందులో తెలుగు మీడియం  విద్యార్థుల  సంఖ్య 17,000 మాత్రమే కావడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో  తెలుగు మీడియం ఉంటుందా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతూ  ఉండటం సంచలనం అవుతోంది.

సర్కార్ ఎయిడెడ్ స్కూల్స్ లో సైతం ఇంగ్లిష్ మీడియంకు  ఆదరణ దక్కుతోంది.  సర్కారు బడుల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా   17 లక్షల మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు కావడం గమనార్హం.  పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు మగపిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లో చదివించడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఈ సర్వే ద్వారా వెల్లడైంది.   ఈ పరిస్థితిపై తెలుగు భాషా అభిమానులు మాత్రం ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులను తెలుగు మీడియంలో చదివేలా ప్రోత్సహించాలనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.  తెలుగు మీడియంకు ప్రాధాన్యత పెరగడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా చర్యలు చేపడతాయేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: