
ఇప్పుడు కిడ్నీలు పాడైపోయాయని ముందుగానే చెప్పగలిగే కొన్ని ముఖ్యమైన లక్షణాలను తెలుసుకుందాం:
1. తరచుగా యూరిన్‌కి వెళ్లడం : కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని వ్యర్థాలు బయటకు సరైన విధంగా వెళ్లవు. ముఖ్యంగా రాత్రిపూట తరచుగా యూరిన్‌కి వెళ్లడం ఒక పెద్ద సంకేతం. ప్రతి అరగంటకు, గంటకు ఒకసారి లేచి టాయిలెట్‌కి వెళ్తూ ఉంటే ఇది కిడ్నీల పనితీరు తగ్గిపోయిందని సూచిస్తుంది. ఈ లక్షణాన్ని లైట్‌గా తీసుకోవద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవాలి.
2. మూత్ర పరిమాణం తగ్గిపోవడం లేదా మార్పులు రావడం : ముందు రోజులతో పోలిస్తే మూత్రం పరిమాణం చాలా తగ్గిపోతే లేదా ఎక్కువ మార్పులు కనపడితే ఇది కిడ్నీ డామేజ్‌కు సంకేతం కావచ్చు. మూత్రం మసకబారడం, నురగ ఎక్కువగా రావడం, ఆకుపచ్చటి లేదా ఎరుపు రంగు చాయలు రావడం, రక్తం తగులుకోవడం వంటి లక్షణాలు కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇవి కిడ్నీలు సరైన విధంగా పనిచేయడం లేదని స్పష్టంగా చెబుతున్న సంకేతాలు.
3. శరీరంలో వాపులు రావడం : కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోని మలినాలు బయటకు వెళ్లకపోవడం వల్ల నీటి నిల్వలు పెరిగి శరీరంలోని వేర్వేరు భాగాల్లో వాపులు వస్తాయి. ముఖ్యంగా కాళ్లు, చేతులు, ముఖం, కంటి కింద వాపు స్పష్టంగా కనిపించవచ్చు. ఇవి కూడా కిడ్నీ సమస్యకు గట్టి హెచ్చరిక సంకేతాలు.
అదనపు లక్షణాలు కూడా గమనించాలి:
*తీవ్రమైన అలసట, బలహీనత
*ఆకలి తగ్గిపోవడం
*శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
*గుండె వేగం పెరగడం
*మలబద్ధకం లేదా విరేచనాలు
ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే తప్పకుండా కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. సమయానికి గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించడం సాధ్యం. కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయడం ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి శరీరంలో ఈ చిన్న లక్షణాలు కనపడగానే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.