
అన్నాన్ని వండిన తర్వాత చల్లార్చడం వల్ల అందులో ఉండే పిండిపదార్థం (Starch) కొంత భాగం 'నిరోధక పిండిపదార్థం'గా మారుతుంది. ఇది జీర్ణాశయంలో త్వరగా జీర్ణం కాకుండా, ఫైబర్ (పీచుపదార్థం) లాగా పనిచేస్తుంది. పిండిపదార్థం కారణంగా, గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదల అవుతుంది. దీనివల్ల సాధారణ అన్నంతో పోలిస్తే, చల్లారిన అన్నం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా పెరుగుతాయి. ఇది మధుమేహంతో బాధపడేవారికి కొంత మేర సహాయకారిగా ఉండవచ్చు.
నిరోధక పిండిపదార్థం పెద్ద పేగులోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది (ప్రీబయోటిక్ లాగా). ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పెరుగుతో కలిపి చద్దన్నం తినడం వల్ల ప్రొబయోటిక్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
మిగిలిపోయిన అన్నాన్ని తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల రోజంతా ఉత్సహంగా ఉండవచ్చని చెబుతారు. మిగిలిపోయిన అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే లేదా తిరిగి వేడి చేస్తే కొన్ని ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. వండిన అన్నం గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు, బాసిల్లస్ సెరియస్ (Bacillus cereus) అనే బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా విషపదార్థాలను (Toxins) ఉత్పత్తి చేస్తుంది. ఈ విషపదార్థాలు వేడి చేసినా కూడా నశించవు. ఈ బ్యాక్టీరియా ఉన్న అన్నం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు సాధారణంగా 6 నుంచి 15 గంటల్లో కనిపించవచ్చు.