టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నాయకుడు నందమూరి తారకరామారావు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించిన విషయం తెలిసిందే. ఇలా చిన్నగ్రామమైన నిమ్మకూరులో పుట్టిన ఎన్టీఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టించారో రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం ప్రస్తుతం పామర్రు నియోజకవర్గంలో ఉంది.


2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన పామర్రులో ఇంతవరకు టీడీపీ జెండా ఎగరలేదు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున డివై దాస్ విజయం సాధించగా, 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఉప్పులేటి కల్పన విజయం సాధించారు.


అయితే వైసీపీ తరుపున గెలిచిన కల్పన...తర్వాత అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో పామర్రులో వైసీపీ తరుపున కైలే అనిల్ కుమార్ రంగంలోకి దిగారు. వెంటనే జగన్, అనిల్‌కు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించేశారు. ఇక ఇన్‌ఛార్జ్‌గా అనిల్...పామర్రులో పార్టీని బలోపేతం చేసుకున్నారు. అధికార పార్టీపై నిరంతరం పోరాటం చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో జగన్ పామర్రు టిక్కెట్ అనిల్‌కే ఇచ్చారు.


అటు టీడీపీ తరుపున కల్పన బరిలో దిగారు. ఇక జగన్ వేవ్‌లో అనిల్ బంపర్ మెజారిటీతో కల్పనపై గెలిచారు. ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేగా గెలిచి అనిల్...పామర్రులో ప్రజలకు అండగా ఉంటున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయ్యేలా చూసుకుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తున్నారు.


కొత్తగా సిసి రోడ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. అయితే నియోజకవర్గంలో ఈ రెండేళ్లలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగలేదు. ఏదో పథకాలు అందుతున్నాయి తప్పా, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి జరగలేదు. ఈ కరోనా సమయంలో కూడా ఎమ్మెల్యే ప్రజలకు పెద్దగా అండగా ఉన్నట్లు కనిపించడం లేదు.


అయితే రాజకీయంగా మాత్రం అనిల్ బలంగానే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి అదిరిపోయే విజయాలు దక్కాయి.  అటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అడ్రెస్ లేరు. ఓడిపోయిన దగ్గర నుంచి పెద్దగా కనిపించడం లేదు. దీంతో పామర్రులో పార్టీ వీక్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది టీడీపీ కేడర్ వైసీపీ వైపు వెళ్ళిపోయారు. అందుకే కల్పనని మార్చేసి కొత్త నాయకుడుని పెట్టాలని టీడీపీ కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తుంది. మొత్తానికైతే ఎన్టీఆర్ అడ్డాలో టీడీపీ పట్టు కోల్పోగా, వైసీపీ ఎమ్మెల్యే హవా నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: