ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి....వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేయడంతో, పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నిదానంగా బయటపడుతుంది. గత ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి, ప్రజల నుంచి వ్యతిరేకత కొనితెచ్చుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాదు..కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. అలా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుకుంటున్న వారిలో పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సాధారణ కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగిన చినరాజప్ప, దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో పనిచేస్తూ వస్తున్నారు. కార్యకర్తగా పార్టీలోకి వచ్చి జిల్లా అధ్యక్షుడు పార్టీకి సేవ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కొన్ని సంవత్సరాలు పనిచేసిన రాజప్పకు చంద్రబాబు 2014 ఎన్నికల్లో పెద్దాపురం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజప్పకు హోమ్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే మంత్రిగా విఫలమైన, ఎమ్మెల్యేగా పర్వాలేదనిపించారు. అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే పెద్దాపురంలో మాత్రం రాజప్ప విజయం సాధించారు.

కానీ టీడీపీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో రాజప్ప సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో కూడా విఫలమైనట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న దవులూరి దొరబాబు దూకుడుగా పనిచేస్తున్నారు. ఈయనకు ప్రభుత్వ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. ప్రజలకు ఏం కావాలో దొరబాబు చూసుకుంటున్నారు.

దీంతో నియోజకవర్గంలో వైసీపీకి లీడ్ పెరిగినట్లు కనిపిస్తోంది. అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పెద్దాపురంలో రాజప్ప ఓడిపోవడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఇకనుంచైనా రాజప్ప తన పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సైలెంట్‌గా ఉంటే నెక్స్ట్ ఎన్నికల్లో రాజప్ప ఖచ్చితంగా ఓడిపోతారనే చెప్పొచ్చు. మరి రాజప్ప మళ్ళీ పికప్ అవుతారేమో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: