మరో టాలీవుడ్ హిట్ మూవీపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్నేశాడు. ఇప్పటికే 'పోకిరి'ని హిందీలో 'వాంటెడ్'గా రీమేక్ చేసిన రికార్డు కలెక్షన్లను సాధించిన సల్మాన్ ఇప్పుడు రవితేజ హిట్ మూవీని రీమేక్ చేస్తున్నాడు. రవితేజ-సురేంధర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన 'కిక్' చిత్ర రీమేక్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడు. సేమ్ టైటిల్ తో బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్‌ నడియాడ్‌వాలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు 150 కోట్ల బడ్జెట్ గా ప్లాన్ చేసుకున్నారు. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.   'కిక్' సినిమా ఊహించని మలుపులతో వినోదాత్మకంగా సాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను బాలీవుడ్ వాతావరణానికి దగ్గరగా స్క్రిప్టులో పలు మార్పులు చేస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఫేమస్ రైటర్ చేతన్ భగత్ కు ఈ వర్క్ అప్పగించారు. ఈ సినిమాలో సల్మాన్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఆయన హెయిర్ స్టయిల్ స్పెషల్ గా ఉండబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో సల్లుభాయ్ సరసన దీపికాపదుకొనే లేదా అనుష్క హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే 'కిక్' మూవీ తమిళంలో జయం రవి, తమన్నా జంటగా "తిలాలంగాడి" పేరుతో రిమేక్ అయ్యి అక్కడ కూడా వసూళ్ళ వర్షం కురిపించింది. ఇప్పటికే వరుస రికార్డులతో యమజోరుమీదున్న సల్మాన్.. భారీ బడ్జెట్ తో బాలీవుడ్ రాబోతున్న కిక్ తో ఎటువంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: