అభిమానులేమో పుష్ప మా ఆకలి తీర్చేసింది అనుకుని సంతృప్తి చెందుతుంటే సగటు సినిమా ప్రేక్షకుడు పుష్ప సినిమా చూసి సుకుమార్ ఏంటి ఇలా అర్ధ ఆకలితోనే పంపించేశాడు అని ఫీల్ అవుతున్నారు. పుష్ప సినిమా ఎనౌన్స్ మెంట్ మొదులు.. రిలీజ్ వరకు కేవలం మెగా ఫ్యాన్స్ అనే కాకుండా వీరిద్దరి కాంబో మీద బాగా అంచనాలు ఉన్న కామన్ ఆడియన్ కూడా పుష్ప ఈసారి తగ్గేదేలే అన్నట్టు ఉన్నారు.

తీరా బొమ్మ పడే సరికి అసలు విషయం అర్ధమైంది. పుష్ప పార్టీ లేదా కాదు సుక్కు మారే మార్గం లేదా అన్నట్టు అయ్యింది ఆడియెన్స్ పరిస్థితి. సినిమా కథ.. హీరో ఎలివేషన్.. పెట్టిన బడ్జెట్.. తీసుకున్న టెక్నికల్ టీం.. అదిరిపోయే మ్యూజిక్ ఇవన్ని ఉన్నా సరే సినిమా చూసిన ఆడియెన్ కు థియేటర్ నుండి బయటకు వచ్చేప్పుడు ఏదో వెలితిగా అనిపించింది. సుకుమార్ సినిమా అంటే మినిమం 3 గంటలు ఉండాల్సిందే. ఆయన కూడా అలానే ఫిక్స్ అయినట్టు ఉన్నాడు.

అఫ్కోర్స్ కంటెంట్ ఉన్న సినిమాలు.. ఆ కంటెంట్ నడిపించే విధానం బాగున్న సినిమాలు 3 గంటలు ఉన్నా చూసి హిట్ చేశారు ఆడియెన్స్. కాని పుష్ప సినిమా రన్ టైం విషయంలో ఎందుకు ఆడియెన్స్ నిరుత్సాహంగా ఉన్నారు అంటే అది ఎక్కువ అనిపించడం వల్లే. సినిమాలో కొన్ని చోట్ల సన్నివేశాన్ని త్వరగా ముగించే అవకాశం ఉన్నా సాగదీశాడని అనిపిస్తుంది. పుష్ప రాజ్, శ్రీవల్లిల మధ్య వచ్చే కొన్ని సీన్స్ ట్రిం చేయొచ్చని అనిపించింది.

సుకుమార్ సినిమాల్లో ఎడిటర్ కు పెద్ద బాధ్యతే ఉంటుంది. అన్ని సినిమాలకు ఎడిటింగ్ చేసినట్టుగా సుకుమార్ సినిమా చేస్తే కుదరదు. ఆయన టేకింగ్ కు.. ఆయన స్క్రీన్ ప్లేకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలానే ఎడిటింగ్ చేయాలి. సీన్ టూ సీన్ క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ ఫైనల్ గా చూసుకుంటే అది ఏ 4 గంటల సినిమానో అయ్యి కూర్చుంటుంది. అయితే ఇక్కడ ఎడిటర్ లను తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. తనకు ఎలా కావాలో అలా ఎడిటింగ్ చేయించుకుంటాడు సుకుమార్. కాబట్టి ఎడిటర్ జస్ట్ సుకుమార్ చెప్పినట్టు చేయాల్సిందే.  

పుష్ప సినిమా చూశాక చాలా చోట్ల సినిమాకు కత్తెర్లు చాలా అవసరం అనిపిస్తుంది. ఈ సినిమాకు కార్తీక్ శ్రీనివాస్, రూబన్ ఎడిటింగ్ చేశారు. వాళ్లకి సుకుమార్ ఎంత సినిమా రష్ ఇచ్చాడో.. వాళ్లు ఎంత సినిమా ఎడిట్ చేశారో కాని సుకుమార్ సినిమా అంటే హీరోలు తమ పాత్రల పరంగా ప్రాణం పెడతారు. సినిమా లెంగ్త్, స్క్రీన్ ప్లే విషయంలో ఎప్పుడూ సుకుమార్ హీరోల కష్టానికి తగిన ఫలితం ఇవ్వడంలో తడపడుతూ ఉంటాడు. ఒకమాట పుష్ప సినిమా లెంగ్త్ దృష్టిలో పెట్టుకుని రిలీజ్ తర్వాత కొన్ని సీన్స్ ట్రిం చేస్తున్నారని చెబుతున్నారు. రిలీజ్ తర్వాత కత్తెర్లు సుకుమార్ సినిమాకు కామనే కదా అని ఆడియెన్స్ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: