ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడుగా
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు విరించి వర్మ. మళ్లీ ఇప్పుడు చాలా కాలం తర్వాత జితేందర్
రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ
సినిమా బీజేపీ లీడర్ జితేందర్
రెడ్డి బయోపిక్ గా రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.
ఆ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాలో హీరో ఎవరన్నది అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించలేదు. ఈ క్రమంలోనే తాజాగా 'జితేందర్ రెడ్డి' సినిమాలో హీరో ఎవరనే విషయాన్ని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోమవారం జితేందర్ రెడ్డి ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా బాహుబలి నటుడు రాకేష్ వర్రె ఈ బయోపిక్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇక పోస్టర్లో రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి గా వైట్ అండ్ వైట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. చేతిలో తుపాకీ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రాకేష్ వర్రే ప్రభాస్ నటించిన 'బాహుబలి' సినిమాతో నటుడిగా వెలుగులోకి వచ్చాడు. అంతకన్నా ముందు ప్రభాస్ నటించిన 'మిర్చి' సినిమాలోనూ కనిపించాడు. మిర్చిలో ఫారిన్ లో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఫైట్ రాకేష్ అండ్ గ్యాంగ్ తోనే ఉంటుంది. ఫైట్ తర్వాత రాకేష్ తో ప్రభాస్ 'వీలైతే ప్రేమిద్దాం డూడ్' అంటూ చెప్పే డైలాగ్ కూడా సినిమాలో ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. మళ్ళీ 'మిర్చి' తర్వాత 'బాహుబలి' సినిమాలో దేవసేనపై చేయి వేసి ఆమెను ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించే సైనికుడిగా నటించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'ఎవరికీ చెప్పొద్దు' అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సినిమాలో రాకేష్ తన డీసెంట్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ ఫీల్ గుడ్ మూవీ తర్వాత ఎవరు ఊహించిన విధంగా పొలిటికల్ లీడర్ జితేందర్ రెడ్డి బయోపిక్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జగిత్యాలకు చెందిన తొలితరం బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలతో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.