
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తెలియకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ ఖరారు కాకుండా దుర్గేష్ ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉండరనేది బహిరంగ రహస్యం. మరి ఇంత పక్కాగా ప్లాన్ చేసిన ఈ భేటీ ఆఖరి నిమిషంలో ఎందుకు ఆగిపోయిందనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకస్మిక ఏపీ పర్యటన కారణంగా ముఖ్యమంత్రి షెడ్యూల్ మొత్తం మారిపోయిందని, దానివల్లే ఈ భేటీ కూడా రద్దయిందని వార్తలు గుప్పుమన్నాయి. ఇది కొంతవరకు వాస్తవమే అయినా, తెర వెనుక అసలు కథ వేరే ఉందని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం, ఈ వాయిదా వెనుక మరిన్ని బలమైన కారణాలున్నాయట.
మొదట కేవలం నిర్మాతలు, దర్శకులతోనే ఈ సమావేశం అనుకున్నారట. కానీ, చివరి నిమిషంలో కథ అడ్డం తిరిగి, కొందరు స్టార్ హీరోల పేర్లు కూడా ఆహ్వానితుల జాబితాలో చేర్చడంతో సీన్ మొత్తం మారిపోయిందని టాక్. మెగాస్టార్ చిరంజీవి ముస్సోరీ షూటింగ్‌లో బిజీగా ఉండటం, ఇతర అగ్ర హీరోలు కూడా తమ తమ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుండటంతో, వారి అపాయింట్‌మెంట్లు దొరకడమే గగనమైందని తెలుస్తోంది. హీరోల డేట్స్ సర్దుబాటు కాకపోవడమే ఈ వాయిదాకు ప్రధాన కారణమనేది ఇప్పుడు బలంగా వినిపిస్తున్న వాదన.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏకంగా డెబ్భై, ఎనభై మందితో కూడిన జంబో టీమ్‌తో ముఖ్యమంత్రిని కలవడం అనేది ఒక జాతరను తలపిస్తుందని, అంతమందితో వెళ్తే చర్చలు సరిగా జరగవని, కొద్దిమంది ముఖ్యులతో, పక్కా ప్రణాళికతో వెళ్తే బాగుంటుందని టాలీవుడ్ నుంచే మంత్రి దుర్గేష్ కి కీలక సూచనలు అందినట్లు సమాచారం.
ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే, ప్రస్తుతానికి ఈ భేటీని వాయిదా వేయడమే మంచిదని నిర్వాహకులు భావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి, టాలీవుడ్ ప్రముఖుల ఏపీ టూర్ వాయిదా వెనుక ఇలాంటి అనేక ఆసక్తికరమైన కోణాలు దాగి ఉన్నాయన్నమాట. అసలు ఏం జరుగుతుందో చూడాలి మరి.