టి.ఎన్.ఆర్. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహారెడ్డి - టీఎన్ఆర్) నటించి, నిర్మించిన చిత్రం 'మిస్టర్ రెడ్డి'. వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, జూలై 18న థియేటర్లలో విడుదలైంది. టీఎన్ఆర్‌తో పాటు మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా, ఒక సాధారణ వ్యక్తి అసాధారణ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం?

కథా నేపథ్యం
టి. నరసింహారెడ్డి అలియాస్ రెడ్డి (టీఎన్ఆర్) చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో, చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు అతని భుజాలపై పడతాయి. చదువును పక్కన పెట్టి కష్టపడి, అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఊరి ప్రెసిడెంట్ కూతురు వెన్నెల (అనుపమ)తో అతని ప్రేమ పెళ్లి వరకు వెళ్లదు. చివరికి సిటీకి వచ్చిన టీఎన్ఆర్, చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుంటూ 'రెడ్డి కన్‌స్ట్రక్షన్' పేరుతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్మిస్తాడు. అయితే, ఎంత డబ్బు ఉన్నా కూడా ఏదో ఒక లోటు, బాధ, ఒంటరితనంతో టీఎన్ఆర్ సతమతమవుతుంటాడు. అలాంటి టీఎన్ఆర్ జీవితంలోకి కీర్తన (దీప్తి) ప్రవేశిస్తుంది. కీర్తన రాకతో టీఎన్ఆర్ జీవితం ఎలా మారుతుంది? పెళ్లిపై కీర్తన అభిప్రాయం ఏంటి? స్నేహితుల చేతిలో టీఎన్ఆర్ ఎలా మోసపోతాడు? చివరకు టీఎన్ఆర్ జీవితంలో సంతోష క్షణాలు వస్తాయా లేదా? అన్నదే ఈ చిత్ర కథ.


దర్శకత్వం & కథనం
ప్రేమ, అనురాగాలు, మిత్రులు, మోసాలు, ఎత్తుపల్లాలు... ఒక మనిషి జీవితంలో ఇవన్నీ సహజమే. ఈ వాస్తవ సంఘటనల ఆధారంగానే 'మిస్టర్ రెడ్డి' చిత్రాన్ని రూపొందించారు. నిర్మాత టీఎన్ఆర్ తన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నారని తెలుస్తోంది. తన జీవిత చరిత్రను తెరపైకి తీసుకురావాలన్న ఆయన తపన సినిమాలో స్పష్టంగా కనిపించింది. టీఎన్ఆర్ ఈ చిత్రానికి నిర్మాతగా, హీరోగా పలు బాధ్యతలు స్వీకరించారు.

ఈ చిత్రం ప్రతి సామాన్యుడికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలోని ఏదో ఒక సంఘటనతో, ఈ సినిమాలోని ఏదో ఒక సన్నివేశం సరిపోలుతుంది. టీఎన్ఆర్ ఎదుగుదల, ఎంత డబ్బున్నా ఒంటరి జీవితం, చిన్ననాటి కష్టాలు, ఊరిలోని స్నేహితులు, ఆత్మీయులే మోసం చేయడం, ప్రేమ దూరం అవ్వడం వంటి ఘటనలు చాలా మంది జీవితాల్లో జరుగుతుంటాయి.

ఫస్ట్ హాఫ్ అంతా మిస్టర్ రెడ్డి జీవితంలోని ఎదుగుదలను చూపిస్తుంది. కీర్తనతో పరిచయం, ప్రేమ సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. మిస్టర్ రెడ్డి వర్తమానం, గతం రెండూ ఒకేసారి సమాంతరంగా సాగే స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. టీఎన్ఆర్‌కు యాక్సిడెంట్ జరిగే సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడి, ఆ తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. సెకండాఫ్‌లో టీఎన్ఆర్ గతానికి సంబంధించిన సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఊహించిన విధంగానే సాగుతాయి.

సాంకేతిక వర్గం
సాంకేతికంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విజువల్స్ సహజంగా ఉన్నాయి. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించారు. సంగీతం ఆహ్లాదకరంగా ఉంది, ప్రేమ పాట ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలం. నిడివి తక్కువగా ఉండటం సినిమాకు కలిసొచ్చే అంశం. నిర్మాతగా టీఎన్ఆర్ ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున చిత్రాన్ని నిర్మించారని తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.

నటీనటుల ప్రతిభ
టీఎన్ఆర్ పాత్ర ఆయన వయసుకు తగ్గట్టుగా ఉంటుంది. యువ హీరోగా కనిపించిన మహాధన్ చక్కగా నటించారు. హీరోయిన్లు దీప్తి, అనుపమ లుక్స్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంటారు, తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రల్లో భాస్కర్, హీరో స్నేహితులు, గ్యాంగ్ వంటి వారందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు.

రేటింగ్: 3/5

మరింత సమాచారం తెలుసుకోండి: