
ఇక ప్రేమ ముదిరి, పుకార్లతో పాటు ఒత్తిడి కూడా పెరిగింది. మొదట్లో తిరస్కరించినా, చివరికి శ్రీదేవి అతడి ప్రేమను అంగీకరించింది. అతనికి భార్య, పిల్లలు ఉన్నారన్న విషయం తెలిసి కూడా, రహస్యంగా అతనితో వివాహం చేసుకుంది. 1996 జూన్ 2న షిర్డీలో, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ రహస్య వివాహం జరిగింది. ఈ జంట ప్రేమకథలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. బోనీ తల్లి, తన కుమారుడి మనసులో శ్రీదేవిపై ఉన్న క్రష్ తెలుసుకుని, రక్షాబంధన్ రోజున ఒక రాఖీని ఇచ్చి, ఆమెకు కట్టమని చెప్పింది. కానీ బోనీ, రాఖీతో పాటు ఒక తాళిని కూడా తీసుకెళ్లి, “రాఖీ కాదు, తాళి కడతాను” అని అన్నాడు. ఈ సంఘటన ఆయన ప్రేమ పట్టుదలను మరింత స్పష్టంగా చూపించింది.
రహస్య వివాహం తర్వాత బోనీ కుటుంబంలో విపరీతమైన కలహాలు చెలరేగాయి. మొదటి భార్య ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. ఆమె పిల్లలు కూడా తీవ్రంగా బాధపడ్డారు. అయినప్పటికీ, బోనీ తన రెండో పెళ్లిని కొనసాగిస్తూ శ్రీదేవితో కాపురం చేశాడు. ఒక సంవత్సరం తర్వాత, 1997లో, బోనీ - శ్రీదేవి బహిరంగంగా మళ్లీ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు – జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ – కలిగారు. శ్రీదేవి పెళ్లి తర్వాత కూడా తన నటనతో బాలీవుడ్‌లో, దక్షిణ భారత సినీ పరిశ్రమలో విశేషంగా రాణించింది.