ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తెలుగు సినిమాల హడావిడి మొదలవుతుంది. వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండగ సీజన్లు వరుసగా రావడంతో బాక్సాఫీస్‌లో పెద్ద పెద్ద సినిమాలు ఒకదానిపై మరొకటి పోటిప‌డుతు వస్తుంటాయి. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ కానుంది. ఇప్పటికే ఆగస్టు చివర్లో రవితేజ మాస్ జాతర రావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడి సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్‌లో వచ్చే అవకాశముంది.


ఇక సెప్టెంబర్ 5న అనుష్క నటించిన ఘాటి సినిమా రిలీజ్ కానుంది. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ మూవీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రాబోతుందని టాక్. అదేరోజు శివకార్తికేయన్ డబ్బింగ్ సినిమా మదరాసి కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాలకూ మంచి అంచనాలు ఉన్నాయి. అదే వారం ఈటీవీ విన్‌లో ఒరిజినల్ సినిమా లిటిల్ హార్ట్స్ కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 12న బాక్సాఫీస్‌పై గట్టి పోటీ కనిపించనుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి హారర్ డ్రామాగా వస్తుండగా, దుల్కర్ సల్మాన్ నటించిన కాంత పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అలాగే విజయ్ ఆంటోనీ డబ్బింగ్ మూవీ భద్రకాళి కూడా అదే రోజున రిలీజ్ అవుతుంది. ఇక తేజా సజ్జా పాన్ ఇండియా ప్రాజెక్ట్ మిరాయ్ కూడా సెప్టెంబర్ 12 లేదా 19న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.



సెప్టెంబర్ 25న మాత్రం టాలీవుడ్ మొత్తం దృష్టి ఒకే సినిమాపై ఉండబోతోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజి. ఈ సినిమా చుట్టూ ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అదేరోజు బాలకృష్ణ అఖండ 2 కూడా రావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని టాక్.మొత్తానికి ఈ సెప్టెంబర్‌లోనే వరుసగా ఘాటి, మదరాసి, కిష్కింధపురి, కాంత, భద్రకాళి, మిరాయ్, ఓజి సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. పెద్ద సినిమాలు, వేరువేరు జానర్లు, స్టార్ హీరోల పోటీతో బాక్సాఫీస్ దగ్గర హంగామా ఖాయమైంది. మరి ఈ లైన్‌లో ఏ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: