టాలీవుడ్ లో ఇటీవల శనివారం నిర్వహించిన ‘ మా ’ జనరల్ బాడీ మీటింగ్ సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లుగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడచిన సంవత్సరం పదవీకాలం ముగిసినా, ‘ మా భవనం పూర్తయ్యే వరకు ’ కొనసాగుతారనే నిర్ణయం తీసుకోవడంతో ఆయన అదే పదవిలో ఉన్నారు. అయితే భవన నిర్మాణంపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేకపోవడం, ప్రగతి లేమి కారణంగా సభ్యులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో భవనం నిర్మాణ స్థితిగతులపై, అలాగే ఎన్నికల నిర్వహణపై సభ్యుల మధ్య వాడి వేడి వాదోపవాదాలు జరిగినట్టు తెలుస్తోంది. మంచు విష్ణు అండ్ టీం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే ఎన్నికలు జరపాలనే అభ్యర్థనను ముందుకు పెట్టినట్లు సమాచారం.
దీనికి అనుగుణంగా సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టాక్. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే జనరల్ బాడీ మీటింగ్‌లో గత నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తారని తెలుస్తోంది. ఇక ఎన్నికల విషయానికి వస్తే మే నెలలో ‘ మా ’ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే దిశగా వ్యూహరచన జరుగుతున్నట్టు సమాచారం. ఈసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకునే విధంగా ముందుగానే సభ్యులతో సమన్వయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎవైనా అగ్ర హీరో కార్యనిర్వాహణ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు వస్తే, ఆ వ్యక్తిని మా ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ప్రకటించేందుకు సిద్ధమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తం కావడం ప్రత్యేకం.
అయితే గత ఎన్నో సంవత్సరాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే అగ్రహీరోలు ‘మా’ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బాధ్యతలు తీసుకోవడంపై కొంత వెనుకంజ వేస్తున్నారని తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజంగానే పెద్ద హీరో ముందుకు వస్తారా? లేక గత మాదిరిగానే పోటీలు, గ్రూప్ రాజకీయాలు కొనసాగుతాయా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. వచ్చే నెలల్లో ‘మా’లో జరిగే పరిణామాలు ఎలా ఉండబోతాయో సినీ పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి