రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా సాహో. బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల తరువాత వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ సరసన తొలిసారి బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ మరియు ప్రమోద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ ఖర్చుతో నిర్మించడం జరిగింది. అయితే ఎన్నో ఎన్నో అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, 

తొలిరోజు తొలిఆట నుండే నెగటివ్ టాక్ ని సంపాదించి, ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లింది. సినిమాకు పెట్టిన ఖర్చంతా కేవలం గ్రాఫిక్స్ కోసమే ఖర్చుపెట్టారని, అంతేకాక కొంత గజిబిజిగా సాగిన కథ మరియు కథనాలు పెద్దగా ఆకట్టుకోలేదని ఈ సినిమాపై మెజారిటీ ప్రేక్షకులు పెదవి విరిచిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సినిమా చాలా ప్రాంతాల్లో నష్టాల బాట పడుతుండడంతో బయ్యర్లకు కొంత సొమ్మును నిర్మాతలు తిరిగి ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఆ విషయం అటుంచితే, సాహో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వసూళ్లు సాధించనప్పటికీ, ఇక్కడితో పోలిస్తే నార్త్ లో మాత్రం బాగానే కలెక్షన్ రాబట్టినట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

ఇప్పటివరకు సాహో హిందీ వర్షన్ రూ.150 కోట్ల పైచిలుకు కలెక్షన్ ని రాబట్టిందని, ఒకరకంగా బాహుబలి తరువాత ప్రభాస్ పేరుని సాహో నార్త్ లో మరింత పెంచిందేతప్ప ఏ మాత్రం తగ్గించలేదని అంటున్నారు. అంతేకాక ఆయన తదుపరి సినిమా జాన్ పై సాహో సక్సెస్ తో అక్కడ మరింతగా అంచనాలు పెరిగాయని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో కూడా నష్టాల బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సాహో, ప్రభాస్ కు కొంత నష్టం మరియు మరికొంత లాభాన్ని చేకూర్చిందనేది మొత్తంగా విశ్లేషకులు చెప్తున్న మాట....!!


మరింత సమాచారం తెలుసుకోండి: