"ప్రతీసారి బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి తంతా!" అని ఎన్టీఆర్ ఓ సినిమాలో డైలాగులు కొడతాడు. గుర్తుందా? మరి ఆ డైలాగ్ విన్నాడో ఏమో మరి, ఓ 5 సంవత్సరాల బుడ్డోడు తన ఇంట్లోకి చొరబడిన ముసుగు దొంగలకు ముచ్చెమటలు పట్టించాడు. దాంతో ఈ బుడ్డోడు సాహసం నచ్చడంతో సామాజిక మాధ్యమాల్లో హీరో స్టేటస్ సంపాదించేసాడు. ఇంతకీ ఈ తంతు ఎక్కడిదో తెలుసా?

ఇండియానాలోని సౌత్ బెండ్ పోలీసులు ఈ వీడియోను అప్లోడ్ చేయగా ఇది వెలుగులోకి వచ్చింది. సదరు వీడియోలో బాలుడుకి సుమారు ఓ 4, 5 సంవత్సరాలు ఉంటాయి. అనూహ్యంగా వారి ఇంటిలోకి చొరపడిన ముసుగు దొంగలు తన తల్లిని, సోదరుడిని ఎటాక్ చేయగా అక్కడే వున్న ఈ పిల్లడు ఆ దుండగులపై దూసుకుని వెళ్ళాడు. అంతే కాకుండా వారిని బొమ్మ తుపాకీతో బెదిరించాడు. కోపంతో ఊగిపోయి చేతిలోని ప్లాస్టిక్ గన్ ను వారి పైకి విసిరి కొట్టాడు.

సదరు పిల్లాడి పేరు డేవిడ్ జాన్సన్. సౌత్ బెండ్ పోలీసులు చెప్పిన వివరాలు ఇలా వున్నాయి.. నలుగురు దుండగులు తమిక రీడ్ ఇంట్లోకి దూసుకుని వెళ్లి, ఇస్త్రీ చేసుకుంటున్న తమికపై దాడి చేసేందుకు యత్నించారు. సదరు దుండగులు చేతుల్లో ఆయుధాలు ఉండటంతో ఒక్క సారిగా తమిక భయపడింది. అయితే అక్కడే వున్న బుడ్డోడు డేవిడ్ వెంటనే తన దగ్గర ఉన్న బొమ్మను తీసుకుని ఆ దుండగుల మీదకు విసిరాడు. అంతేకాకుండా వారిని కొట్టడానికి ప్రయత్నించాడు డేవిడ్.

అయితే ఈ క్రమంలో దుండగులు ఆ ఇంట్లోని ఎవరికీ హాని చేయకపోవడం విశేషం. అలాగే వారు ఎవరి మీద కాల్పులు జరపలేదు. కాగా ఈ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. డేవిడ్ చేసిన సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. పోలీసులు కూడా డేవిడ్ సాహసాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా... "చాలా మంది ఆ చిన్న పిల్లాడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ ఉన్నారు. అతడికి గోల్డ్ స్టార్ ఇవ్వాలని కూడా అడుగుతున్నారు. అది నిజమే.. అతడు ఉన్న పరిస్థితుల్లో ఎంతో ధైర్యంగా ప్రవర్తించాడు మరి" అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: