టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు సీఎం జగన్. మామూలుగా సీఎం జగన్ ఏ కార్యక్రమం ప్రారంభించినా.. అదే రోజున చంద్రబాబు కూడా ఏదో ఒక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉండేవారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో మైలేజీ రాకుండా తనవంతుగా ప్రయత్నాలు చేస్తుంటారనేది అధికారపక్షం ఆరోపణ. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమరావతి రైతులు రాజధాని కోసం చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో చంద్రబాబు హాజరై.. ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో జగన్ అలెర్ట్ అయ్యారు. చంద్రబాబు బహిరంగసభ జరిగే సమయానికే తన పర్యటన పెట్టుకున్నారు.

తిరుపతి సభకు కౌంటర్ గా విశాఖపట్నంలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక రిసెప్షన్ కు హాజరయ్యేందుకు వస్తున్నారు. బాబుకు కౌంటర్ ఇచ్చేందుకు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలను కూడా ఇదే రోజు టైమ్ ఫిక్స్ చేశారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జీతో పాటూ.. మరొక ఆరు ప్రాజెక్టులను సీఎం ప్రారంభించబోతున్నారు. పార్కుల ప్రారంభోత్సవాలు, జీవీఎంసీ అభివృద్ధి చేసిన కొన్ని ప్రాజెక్టులను కూడా సీఎం ప్రారంభించి పరిశీలిస్తారు. మొత్తానికి సీఎం జగన్ విశాఖ పర్యటన మొత్తం బిజీబిజీగా సాగేలా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు అధికారులు. అటు అమరావతికోసం రైతులు, విపక్షాలు పోరాటం చేస్తుంటే.. ఇటు మూడురాజధానుల ప్రతిపాదనలో ఒకటైన విశాఖలో జగన్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుండటం విశేషం.

అమరావతి రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు చివరి దశకు చేరడంతో.. భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు కూడా పని చేస్తున్నారు. అమరావతి రైతులకంటే ఎక్కువగా టీడీపీ నేతలే ముందుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రసంగం ఆకట్టుకునేలా తయారు చేశారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటో చంద్రబాబు వివరించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇదే సమయానికి సీఎం జగన్ పర్యటన కూడా ఉండటంతో మీడియా ఫోకస్ ఇటు విశాఖపట్నం వైపు కూడా ఉండబోతోంది. మొత్తానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఒకే రోజున ఇలా పోటాపోటీ  కార్యక్రమాలు చేపట్టడం మాత్రం విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి: