సుజనా చౌదరి.. ఆయన ఓ వ్యాపార వేత్త.. అనేక సంస్థలు ఉన్నాయి. వ్యాపారం ఆయన ప్రధాన వృత్తి. టీడీపీకి ఆయన చాలా కాలం బ్యాక్ బోన్‌గా ఉన్నారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సుజనా చౌదరి పార్టీకి ఆర్థికంగా సాయం చేశారని చెబుతారు. టీడీపీ గతంలో విపక్షంలోదాదాపు పదేళ్లు ఉన్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి పారిశ్రామిక వేత్తలే ఆదుకున్నారని పార్టీ శ్రేణులు చెబుతుంటాయి. ఆ తర్వాత సుజనా చౌదరి నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా ఎంపీ కూడా అయ్యారు.


విచిత్రం ఏంటంటే.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న సుజనా చౌదరి.. సరిగ్గా 2019 ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఒక్క సుజనా చౌదరి మాత్రమే కాదు.. టీడీపీ ఎంపీలు ఇంకొందరు కట్టకట్టుకుని బీజేపీలోకి వెళ్లిపోయారు. రాజకీయాల్లో ఇలా పార్టీ మారడం సహజమే.. కానీ.. ఇందుకు ఏ కారణమూ కనిపించదు. ఓ వ్యూహం ప్రకారం చంద్రబాబు ఈ టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపారని వైసీపీ నాయకులు ఇప్పటికీ విమర్శిస్తుంటారు.


సుజనా చౌదరి బీజేపీలో చేరినా.. ఎప్పుడూ టీడీపీని పెద్దగా విమర్శించింది లేదు. ఎవరూ సుజనా చౌదరి చంద్రబాబును విమర్శిస్తాడని ఆశించరు ఊహించరు కూడా. అయితే తాజాగా విజయవాడలో జరిగిన ప్రజాగ్రహ సభలో  ఈ వింత చోటు చేసుకుంది. సుజనా చౌదరి టీడీపీని నేరుగా విమర్శించారు. బీజేపీలో కుటుంబ పాలన ఉండదని చెబుతూ.. టీడీపీలో అయితే.. చంద్రబాబు నాయుడో.. ఆ తర్వాత లోకేశ్ నాయుడో.. ఆ తర్వాత ఇంకొకరో సీఎం అవుతారు..కానీ బీజేపీలో మాత్రం అలా వారసత్వంగా పదవులు రావు అని నేరుగా టీడీపీని విమర్శించారు.


సుజనా చౌదరి చేసిన ఈ విమర్శలు చూసి చాలా మంది అవాక్కయ్యారు. సుజనా చౌదరి కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారా అని ఆశ్చర్యపోయారు. పాపం.. తప్పుదు కదా.. ఎంత ఇష్టం ఉన్నా.. లేకపోయినా కొన్నిసార్లు రాజకీయాల కోసం అలా విమర్శించాల్సి రావచ్చు.. ఏదేమైనా సుజనా చౌదరి నోట ఈ విమర్శలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: