దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ కర్ణాటకలో రాజకీయసంక్షోభానికి తెరలేపింది. కాంగ్రెస్,జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారు కావడంతో అది తుదిదశ కు చేరుకున్నట్లయింది. తమ రాజీనామాలను ఆమోదించాలని రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.ఇక జరగవలసిన తంతు స్పీకర్ నిర్ణయాధికారాలపై ఆధారపడివుంది.

రోజుకో మలుపు తిరుగుతూ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కర్ణాటకం, రిసార్ట్ రాజకీయాలు,అరెస్టులు,బుజ్జగింపులు నడుమ కొనసాగింది .ఈ తంతును దేశప్రజలు ఎంతో ఆసక్తిగా గమనించారు.ఒక దశలో రాజీనామాకు ససేమిరా అన్న ముఖ్యమంత్రి, ఎలాగైనా బలపరీక్షలో నెగ్గుకురాగలమన్న ధీమాను వ్యక్తం చేసారు. వారిది మేకపోతు గాంభీర్యమేనని బీజేపీ ఎద్దేవా చేసింది. సంకీర్ణ పెద్దల వ్యూహాలను క్షుణ్ణంగా గమనిస్తున్నబీజేపీ అధినాయకత్వం తమ ఎమ్మెల్యేలు సైతం చేజారకుండా ముందు జాగ్రత చర్యలు చేపట్టింది.

రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాతో, స్వతంత్రుల మద్దతుతో ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ ను సాధించి, సుస్థిర ప్రభుత్వాన్ని స్థాపించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. కర్ణాటకతో ఆగకుండా తమకు మెరుగైన అవకాశాలున్న తెలంగాణాలో సైతం రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: