రాయలసీమ.. ఒకనాటి రత్నాల సీమ.. రాయలేలిన సీమ. పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న తరహాలోనే ఉంది ఈ సీమ పరిస్థితి. నిలువెల్లా గనులున్న సీమగా పేరున్నా సాగునీరు లేక అల్లాడుతోంది. వర్షంపాతం తక్కువ. సాగునీటి వసతులు కరవై ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత కరువు ప్రాంతంగా మిగిలిపోతోంది.


రాయలసీమ కరవుకు సంబంధించిన గణాంకాలు చూస్తే కళ్లు తిరగకమానవు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్ర కరువును ఎదుర్కొంటున్నాయి. గత పదేళ్లలో ఇక్కడ దుర్భిక్ష పరిస్థితులున్నాయి. ఏడేళ్లుగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం పడుతోంది. ఈ జిల్లాల్లోని దాదాపు 80శాతం ప్రాంతాల్లో భూగర్భజలాలు తీవ్రంగా పడిపోయాయి. కరువు, వర్షపాతం లోటులో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌రాష్ట్రం, అనంతపురం జిల్లాలు ఒక్కటే.


ఈ ఆరు జిల్లాల్లో 199 లక్షల ఎకరాలకు గాను అందులో సగం ప్రాంతంలో మాత్రమే వ్యవసాయం ఉంది. తుంగభద్ర , పెన్నా, కృష్ణానదులపై ఈప్రాంతం ఆధారపడి ఉన్నా.. తుంగభద్ర, పెన్నాల నుంచి వచ్చే జలాలు శూన్యంగా మారాయి. ఇక శ్రీశైలం జలాలే ఈ ప్రాంతానికి ఆధారం.


ఐతే.. కొన్నేళ్లుగా శ్రీశైలం నిండటం కూడా కష్టంగానే ఉంది. గడచిన 52 ఏళ్లలో శ్రీశైలంలోకి సగటున 1128 టీఎంసీల నీళ్లు వస్తే, గడచిన పదేళ్లలో వచ్చిన జలాలు సగటున 632 టీఎంసీలు మాత్రమే. మహారాష్ట్ర, కర్ణాటకలు కొత్త ప్రాజెక్టులు కారణంగా నీళ్లు రావడంలేదు. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకుపెంచుతున్నారు.


ఈ కారణాలతో రాయలసీమకు కృష్ణాజలాలు అరకొరగా వచ్చినా ఆధారపడేంతగా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలను శ్రీశైలానికి తరలింపు అంశం సీమ వాసుల్లో ఆనందం నింపుతోంది. ఈ ప్రక్రియ వల్ల తమకు నీటి కోరత తీరుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ, తెలంగాణ సీఎంలు ఓ అవగాహనకు వచ్చారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: