తెలంగాణ‌లోని ఉద్యోగార్థులు, నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌. రాష్ట్రంలోని ఖాళీల భ‌ర్తీలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు డిజిట‌ల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో వివిధ రంగాల్లో ఉద్యోగాల వివరాలను నిరుద్యోగులకు అందించేందుకు రూపొందించిన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజి ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ-డీట్) యాప్‌ను సచివాలయంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తో కలిసి రాష్ట్ర కార్మిక, మహిళాశిశుసంక్షేమ, ఉపాధి కల్పనశాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి ఆవిష్కరించారు. 


మంత్రి మ‌ల్లారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ రంగాల్లోని ఉద్యోగ ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి డీట్ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దీని ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారానే ఇంటర్వ్యూలు కూడా చేపట్టవచ్చునని, తెలంగాణవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన 45 వేలకుపైగా ఉద్యోగ ఖాళీలను ఈ యాప్‌లో పొందుపరిచామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కల్పిస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు.


ఐటీ, పరిశ్రమలశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణకు పెద్ద కంపెనీలు తరలివస్తున్నాయని, వన్‌ప్లస్ సంస్థ తమ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను సోమవారం ప్రారంభించిందని తెలిపారు. రానున్న మూడేళ్ల‌లో వన్‌ప్లస్ సంస్థ 1500 పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నదని చెప్పారు. నగరంలో ప్రారంభమవుతున్న కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను భర్తీచేసుకొనేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 

కాగా, ఇటీవ‌లి కాలంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవ‌కాశాల క‌ల్ప‌న‌కు ప‌లువురు ప‌లు క‌న్స‌ల్టెనీలు నిధులు వ‌సూలు చేయ‌డం, మోసాలు చేయ‌డం త‌ర‌చుగా చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాప్ దానికి ప‌రిష్కారం చూపుతుంద‌ని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: