సెప్టెంబర్ 2.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి.. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి జ్ఞాపకాలతో ఎమోషనల్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలతో తన తండ్రికి ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో మహా నేత, తన తండ్రి వై యస్‌ రాజశేఖరరెడ్డి నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయని వై యస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.


దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. "పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయి. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసింది. నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువలబాటలో నడిపిస్తూనే ఉంటుంది'' అని పేర్కొన్నారు.


సెప్టెంబర్‌ 2 వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో పాటు వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతి, వైయస్‌ షర్మిల నివాళులర్పించారు. అనంతరం పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించిన వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమాల్లో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు.


ఇక రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. నల్లకాల్వ వద్ద గల వైయస్‌ఆర్‌ స్మృతివనంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్ పార్క్ హోటల్ సర్కిల్ వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: