ఐదేళ్ల పాలనలో చంద్రబాబు సర్కారు చేసిన దోపిడీని జగన్ బయటపెడుతున్నందుకే.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పల్నాడుపై చంద్రబాబు చేస్తున్న హడావుడికి వైసిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. గతంలో చంద్రబాబునాయుడు దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు కూడా ప్రజలను రెచ్చగొట్టి మోసం చేయాలని చూస్తున్నారని నరసరావుపేట వైసిపి ఎమ్.పి లావు కృష్ణదేవరాయలు అన్నారు.


పల్నాడు ప్రజలు అభివృద్ధి, శాంతి కోరుకుంటున్నారని.. అక్కడ చిచ్చు పెట్టొద్దని చంద్రబాబును నరసరావు పేట ఎంపీ కోరారు. గతంలో జరిగిన అరాచకాలపై చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరు సభకు కోడెల, యరపతినేనితోపాటు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పల్నాడు మాజీ ఎమ్మెల్యేలను కూడా తీసుకురావాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు. టీడీపీ పాలనలో జరిగిన అరాచకాలపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్‌ విసిరారు.


ప్రజాధనాన్ని దోచుకున్న టీడీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పునరావాసం కల్పిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చారని నాని అన్నారు. ప్రజా సంక్షేమం​ కోసం కృషి​ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మొదటి మూడు నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు.


వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. పల్నాడు పౌరుషాన్ని చంద్రబాబు కించపరుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో రౌడీషీటర్లు తప్ప, పల్నాడు ప్రాంత ప్రజలు ఎవరూ లేరని బ్రహ్మనాయుడు అన్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: