ఏపీ రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చాలని నిర్ణయించారు. అయితే ఇది తుగ్లక్ నిర్ణయం అంటున్నారు ప్రతిపక్షనేత చంద్రబాబు. అమరావతి అన్నది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని.. రాజధానిలో అన్నినిర్మించిన తర్వాత కూడా పది వేల ఎకరాల భూమి మిగులుతుందని.. దాన్ని అమ్మితే లక్ష కోట్లు వస్తాయని.. అప్పుడు పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మించుకోవచ్చని చంద్రబాబు అంటున్నారు.

 

అయితే చంద్రబాబు చెప్పేదంతా అబద్దం అంటున్నారు ఏపీ సీఎం జగన్. ఈ విషయాన్ని ఆయన బుధవారం సభాముఖంగానే చెప్పారు. హిందూ పత్రిక ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించిన సీఎం.. ఏమన్నారంటే.. “ చంద్రబాబు చెబుతున్నట్లుగా క్యాపిట‌ల్ నిర్మించేందుకు అనువైన భూమి ఇక్కడ లేదు. నేను అధికారుల‌ను సంప్రదించిన త‌రువాత వారు నాకు ఆశ్చర్యం క‌లిగించే విష‌యాల‌ను చెప్పారు. అవేంటంటే.. ఎంత భూమి ఉందంటే.. నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యూన‌ల్, న‌ది ప‌రివాహ‌క చ‌ట్టం ప్ర‌కారం లీగ‌ల్‌గా భ‌వ‌నాలు క‌ట్టేందుకు మిగిలింది కేవ‌లం 5200 ఎక‌రాల భూమి మాత్రమే..”

 

" రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం జ‌ర‌గాల‌ని నిర్ణయం మూడు రాజ‌ధానుల నిర్ణయం తీసుకున్నాం. రాబోయే త‌రాల‌కు స‌మాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది. రాబోయే త‌రాల వ‌ర‌కు అభివృద్ధి, ఉద్యోగాలు కోరుకుంటారు. డిగ్రీ పూర్తి చేసుకొని చేతుల్లో ప‌ట్టాలు ప‌ట్టుకొని యువ‌త ఉద్యోగాలు కోసం వెతుకుతారు.. వారంతా ఎక్కడ‌కు వెళ్లాలి.. అని ప్రశ్నించారు సీఎం జగన్.

 

సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. “ అమ‌రావ‌తి లాంటి అద్బుత‌మైన న‌గ‌రాలు క‌ట్టేందుకు ఫండ్స్ లేవు. ఇది రాష్ట్ర ప్రస్తుత ప‌రిస్థితి. అమ‌రావ‌తిలో పెట్టే ఖ‌ర్చులో 10 శాతం మాత్రమే విశాఖ‌కు అవ‌స‌రం. ఇప్పుడిలా విమ‌ర్శలు చేస్తున్నార‌ని చెప్పి విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లించ‌కుండా ఉంటే రేపు పొద్దున ఐదేళ్ల త‌రువాత వ‌చ్చి మ‌న రాజ‌ధాని ఏది అని చూపించ‌మంటే.. అమ‌రావ‌తిని పూర్తిచేసేన్ని డ‌బ్బులు మ‌న ద‌గ్గర లేవు కాబ‌ట్టి ఏ ప‌ల్లెటూరునో.. తుళ్లూరు మండ‌లాన్నో రాజ‌ధానిగా చూపించాలి. అమ‌రావ‌తికి రూ. ల‌క్ష కోట్లు ఖ‌ర్చు అవుతుంది. అది కూడా అప్పు తీసుకొచ్చి పెట్టాలి.. 20 ఏళ్ల త‌రువాత ఈ రూ. ల‌క్ష కోట్లకు వ‌డ్డీ రూ. 3 లేదా 4 ల‌క్షల కోట్లు అవుతుంది..అంటూ వివరించారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: