కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో ఎక్కుగా నష్టపోయిన దేశం ఏదైనా ఉందంటే.. అది చైనాయే అంటారు అందరూ.. అది వాస్తవం కూడా. కరోనా కారణంగా చైనా అధికారికంగానే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయింది. అనధికారికంగా ఈ సంఖ్య లక్షల్లో ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక చైనాలో ఈ వైరస్ భారిన పడివారి సంఖ్య లక్షల్లో ఉంది. మరి అలాంటి చైనాకు కరోనా వల్ల లాభాలు కూడా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.

 

 

కానీ ఇది వాస్తవం. కరోనా కారణంగా చైనాలోని కొన్ని నగరాల్లో జనం పూర్తిగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇళ్లు దాటి జనం బయటకు రావడం లేదు. ప్రభుత్వమే రావద్దని చెప్పేసింది. దీంతో అక్కడి పారిశ్రామిక రంగం కుంటుపడింది. చైనా పారిశ్రామికంగా ఎంత ఎదిగిందో మనకు తెలుసు కదా. కరోనా చైనా ఆర్థికవృద్ధిని కుంగ దీసినప్పటికీ వాయు కాలుష్యం మాత్రం మునుపెన్నడూ లేని స్థాయిలో తగ్గింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ అంతరిక్ష సంస్థలు చైనాలో వాయు కాలుష్యానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన చిత్రాలు ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపెట్టాయి.

 

 

ఈ చిత్రాల ప్రకారం.. జనవరి 1 నుంచి 10 వరకూ.. అంటే కరోనా ప్రబలక మునుపు మధ్య చైనా దేశ వాతావరణంలో NO2 పరిమాణం అధిక స్థాయిలో ఉంది. కానీ ఫిబ్రవరి నెలలో.. అంటే కరోనా విజృంభించాక.. దీని స్థాయి భారీగా తగ్గిపోయింది. వైరస్ కేంద్రమైన వూహాన్ నగరంలో తొలుత NO2 స్థాయిలు తగ్గాయి. ఆ తర్వాత బీజింగ్, షాంఘాయ్ వంటి నగరాల్లోనూ వాయు కాలుష్యం భారీగా తగ్గిపోయింది. కాలుష్యం ఈ స్థాయిలో తగ్గుముఖం పట్టడం గతంలో నేను ఎప్పుడూ చూడలేదని నాసా పరోశోధకుడు ఫేయ్ లియూ కామెంటే చేశాడంటే సీన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

 

చైనాలో మోటార్ వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర కర్మాగారాలు అత్యధికంగా ఈ NO2 గ్యాస్‌ను అధిక మొత్తంలో విడుదల చేస్తుంటాయి. అమెరికా తరువాత అత్యధికంగా కర్బన ఉద్గారాలు వెదజల్లే దేశం చైనాయే. అతి తక్కువ ధరకు ముడిసరుకులు, కార్మికులు చైనాలో లభ్యం కావడంతో పారిశ్రామికంగా ఆ దేశం దూసుకుపోయింది. ఇది ఎన్నో అభివృద్ధి ఫలాలను అందించినప్పటికీ..కాలుష్యం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: