అమెరికాలో పరిస్థితులు రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతున్నాయి. వారం పదిరోజుల్లో మరణాలు ఊహించని స్థాయిలో పెరుగుతాయని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో మూడు లక్షలు దాటిన కరోనా కేసులు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. న్యూయార్క్‌లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు కరోనాతో మరణిస్తున్నారు.  

 

కరోనా కల్లోలంతో అమెరికా విలవిలలాడిపోతోంది. రోజురోజుకు పరిస్థితులు చేజారిపోతున్నాయి. నిన్న ఒక్క రోజే అమెరికాలో 1100 మంది కరోనాతో చనిపోయారు. కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షల 11 వేలు దాటిపోవడం... మరణాలు కూడా 10 వేలకు చేరువలో ఉండటంతో  హెల్త్ ఎమర్జెన్సీ నుంచి ఎలా బయటపడాలో అమెరికాకు అంతుపట్టడం లేదు. కేసులు లక్షల్లో ఉంటే... కోలుకుంటున్న వారు కేవలం 15 వేల లోపు మాత్రమే ఉన్నారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే లక్షా 13 వేల  మంది కరోనాతో బాధపడుతున్నారు.  న్యూయార్క్‌లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు కరోనాతో మృతి చెందుతున్నారు. రానున్న వారం పది రోజుల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉంటాయని ట్రంప్ ప్రకటించారు.

 

వైద్య పరికరాలు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్స్ కొరత అమెరికాను వేధిస్తోంది. చైనా సహా అనేక దేశాలు అమెరికాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి.  అన్ని రాష్ట్రాల్లోనూ ఆంక్షలను ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ స్థాయి ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొంటున్నా సరే... ట్రంప్ తన టెంపరితనాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లను ఉపయోగించాలని ఫెడరల్ ప్రభుత్వం ప్రకటిస్తే.. ట్రంప్ మాత్రం అధికారుల నిర్ణయానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. ప్రజలు పెట్టుకుంటే పెట్టుకోండి....కానీ తాను మాత్రం మాస్క్ ధరించనని ట్రంప్ ప్రకటించారు.

 

కోవిడ్ 19ను కట్టడి చేసే విషయంలో ట్రంప్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమెరికాలో  ట్రావెల్ ఆంక్షలు అమలు చేయడానికంటే ముందే... దాదాపు 4 లక్షల మంది చైనా నుంచి అమెరికాకు వచ్చినట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా... అమెరికాలో ముందస్తు చర్యలు చేపట్టలేదు. దీంతో వుహాన్ సహా చైనాలోని కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షల మంది అమెరికాకు వెళ్లారు. 

 

చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి 1300ల డైరెక్ట్ విమానాల ద్వారా అమెరికాలోని 17 ప్రధాన నగరాలకు 4  లక్షల మంది చేరుకున్నారు. ట్రంప్ కళ్లు తెరిచిన ఆంక్షలు విధించేలోపే.. వీరిలో చాలా మంది అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యారు. వుహాన్‌లో పరిస్థితిని ముందే గుర్తించి అమెరికా మేల్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిపుణులు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: