ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఈరోజు ఉదయం వరకు 304 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా విశాఖలోని మటన్ వ్యాపారికి కరోనా నిర్ధారణ అయింది. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన మటన్ వ్యాపారి గత నెలలో శ్రీకాళహస్తిలో జరిగిన ప్రార్థనలకు హాజరయ్యారు. అనంతరం ఒక మసీదులో ఎనిమిది మందితో ఒక రోజంతా గడిపాడు. 
 
ఆ సమయంలోనే వ్యాపారికి కరోనా సోకిందని సమాచారం. ఆ మసీదులో గడిపిన వ్యక్తికి కరోనా సోకడంతో అధికారులు మటన్ వ్యాపారి నుంచి శాంపిళ్లను సేకరించారు. మటన్ వ్యాపారికి కరోనా లక్షణాలేవీ కనిపించకపోవడంతో అతన్ని ఇంటికి పంపించారు. ఆదివారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారి చికెన్, మటన్ విక్రయించారు. మటన్ వ్యాపారికి కరోనా సోకడం స్థానికంగా కలకం రేపుతోంది. 
 
అధికారులు ఇప్పటికే మటన్ వ్యాపారి చుట్టుపక్కల ప్రాంతాలలో శానిటైజ్ చేశారు. ఇప్పటివరకూ ఆ వ్యక్తి 48 మందిని కలిసినట్లు అధికారులు గుర్తించారు. 48 మందికి సంబంధించిన వివరాలను సేకరించి వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారులు ఆ వ్యక్తి దగ్గర మటన్ కొనుగోలు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకూ 304 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈరోజు రాష్ట్రంలో ఒకే ఒక కేసు నమోదైంది. ఈరోజు కర్నూలు జిల్లాలో కరోనా వల్ల ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోవడం గమనార్హం. ఈ వ్యక్తికి ఇంతకుముందే డయాబెటిస్, ఇతర వైద్య సమస్యలతో బాధ పడుతున్నాడని సమాచారం.               

మరింత సమాచారం తెలుసుకోండి: