భారత్‌కు పక్కలోబల్లెంలా ఉన్న వక్రబుద్ధి పాకిస్తాన్‌ కు ఇండియా తగిన బుద్ధి చెప్పింది. కాశ్మీర్‌లో చొరబడేందుకు ఆ దేశ సైనికులు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అలా ఇలా కాదు.. భారత్ చేసిన దాడిలో ఏకంగా 35 మంది వరకూ తీవ్రవాదులు, పాక్ సైనికులు హతమయ్యారు.

 

 

వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్ లోని కేరన్  సెక్టర్ లో ఉగ్రవాదుల చొరబాటుకు వీలుగా కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు ఈ నెల 10న భారత సైన్యం జరిపిన దాడిలో దాయాది దేశానికి భారీ నష్టం  జరిగింది. భారత్ జరిపిన దాడిలో పాక్  సైనికులు, ఉగ్రవాదులు 35 మంది హతమయ్యారు. కేరన్  సెక్టర్ లో ఈ నెల 5న జరిగిన ఎన్ కౌంటర్ లో ప్రత్యేక దళ కమాండో దళానికి చెందిన సుశిక్షితులైన అయిదుగురు జవాన్లు వీర మరణం పొందారు. 

 

దొంగ దెబ్బకు బదులు తీర్చుకునేందుకు భారత సైన్యం పదో తేదీన ప్రతి చర్య చేపట్టింది. నీలం లోయలోని పాక్  శిబిరాలను లక్ష్యం చేసుకుని భారీ ఆయుధాలతో దాడికి దిగింది. 9కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల 120 ఎం.ఎం. శతఘ్నులు, 6 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురి పెట్టగల 81 ఎం. ఎం. మోర్టార్లతో భారత సైన్యం దాడి జరిపింది. 

 

 

భారత్ భీకరంగా జరిపిన ఈ దాడిలో పాక్  ఉగ్రవాద శిబిరాలు, ఒక ఆయుధాగారం, మరో శతఘ్ని శిబిరం, రెండు మోర్టార్  ప్రయోగ శాలలు ధ్వంసం కాగా, ఉగ్రవాదులు, పాక్  సైనికులు కలిపి 35 మంది హతమయ్యారు. ఆయుధాగారం పేలిపోవడం వల్ల మృతుల్లో పాకిస్తాన్  సైనికులే ఎక్కువ మంది ఉంటారని భారత నిఘా వర్గాలు తెలిపాయి. మరోసారి భారత్ వైపు చూడాలంటే భయపడేవిధంగా భారత్ తగిన బుద్ధి చెప్పింది. ఇలా ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా పాక్ అంతే..

మరింత సమాచారం తెలుసుకోండి: