ఏలియన్స్.. UFOలు.. ఎగిరే పళ్లాలు... ఇలా అంతరిక్షంలో అంతుచిక్కని అంశాల గురించి మనం వింటూనే ఉన్నాం.. అసలు ఇవి ఉన్నాయో.. లేవో తెలీదు.. లేకుంటే ఎందుకు వీటిపై ఇంతగా చర్చించుకుంటున్నామనేవాళ్ళూ లేకపోలేదు. అయితే ఈ అంతుచిక్కని అంశాల గురించి అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ తొలిసారి నోరు విప్పింది. గతంలో రెండు సందర్భల్లో కనిపించిన అన్‌ ఐడెంటిఫైడ్‌ ఆబ్జెక్ట్స్‌-UFOలు నిజమేనంటూ వీడియోలను కూడా రిలీజ్ చేసింది.

 

UFOలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ మాత్రం ఎప్పుడు వీటి టాపిక్ వచ్చినా కరాఖండిగా కొట్టిపారేసేది. అసలు అలాంటి వస్తువులే లేవని చెప్తూ వచ్చేది. అయితే ఇప్పుడు పెంటగాన్ కూడా ఇవి ఉన్నాయంటూ ఏకంగా వీడియోలనే విడుదల చేసింది.

 

2004, 2015 సంవత్సరాల్లో ఆకాశంలో ప్రయాణిస్తున్న నౌకా విమాన పైలెట్లకు వింత వస్తువులు కనిపంచాయి. అప్పట్లో ఆ పైలట్లు వాటి గురించి చర్చించుకున్నారు. వారి సంభాషణ కూడా రికార్డ్ అయింది. విమానం కంటే వేగంగా పయనిస్తున్నాయని.. అవేంటివో సరిగా అర్థం కావట్లేదని పైలెట్లు మాట్లాడుకున్నారు. విమానాలు రికార్డ్ చేసిన ఆ వీడియోలు చాలా కాలం కిందటే ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. 2017లో న్యూయార్క్ టైమ్స్, ఆ తర్వాత స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌ అండ్ సైన్స్ గ్రూప్ ఈ వీడియోలను బయటపెట్టాయి. అయితే వీటిపై అప్పుడు పెంటగాన్ స్పందించలేదు.

 

ఏలియెన్స్‌పై అధ్యయనం చేయడానికి పెంటగాన్‌ సీక్రెట్‌ ఆపరేషన్ చేస్తోందంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అమెరికా ప్రభుత్వం సీక్రెట్‌గా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. భారీ మొత్తం వెచ్చించి పెంటగాన్ నేతృత్వంలో ఈ అన్వేషణ కొనసాగుతోందని ఊహాగానాలు వినిపించాయి. కానీ అటు అమెరికా ప్రభుత్వం కానీ, పెంటగాన్ కానీ ఆ వార్తలను ఖండించలేదు.. అలాగని సమర్థించలేదు.. 

 

అయితే ఇప్పుడు కరోనా కల్లోలం కొనసాగుతున్న సమయంలో పెంటగాన్ UFOల వీడియోలు రిలీజ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంటర్నెట్‌లో ఉన్న UFO ఫుటేజ్ నిజమా కాదా అనే సందేహాన్ని తీర్చేందుకు వీయోల‌ను రిలీజ్ చేసిన‌ట్లు రక్షణశాఖ వెల్ల‌డించింది. అయితే వాటికి సంబంధించిన సున్నిత‌మైన విష‌యాల‌ను మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేద‌ు. విమాన పైల‌ట్లకు ఈ తరహా యూఎఫ్‌వోల‌ు కనిపిస్తే వాటి గురించి వెల్లడించాలని పెంటగాన్ కోరింది..

 

ఇన్నాళ్లూ ఏలియెన్స్, UFOలను ఖండిస్తూ వచ్చిన పెంటగానే ఇప్పుడు వీడియోలు నిజమేనని అంగీకరించడంతో సరికొత్త చర్చ మొదలైంది. పెంటగాన్ అంగీకరించిందంటే.. ఏలియెన్స్ ఉన్నట్టేనా.. అనే ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: