ఈ లాక్ డౌన్ మొదలైన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు...సీఎం జగన్‌కు పలు అంశాల్లో లేఖలు రాసిన విషయం తెలిసిందే. అయితే బాబుతో పాటు నారా లోకేష్ కూడా జగన్‌కు లేఖలు రాస్తున్నారు. లేఖ కాబట్టి ఎవరోకరు టైప్ చేసేస్తారు. ఇక దాన్నే చినబాబు జగన్‌కు పంపిస్తున్నారు. తాజాగా కూడా చినబాబు...జగన్‌కు ఓ లేఖ రాశారు.

 

తెలుగు రాష్ట్రాలకు మిడతల ముప్పు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రైతన్నలు భయపడుతున్నారని, ఈ తరుణంలో తగు నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మిడతల దండు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలపై దాడి చేసిందని, వాటితో మన రాష్ట్రానికి కూడా ముప్పు ఉందని, అనంతపురంలోని రాయదుర్గంలో మిడతలు ప్రవేశించాయనే వార్తలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయని చెప్పారు.

 

కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే  డ్రోన్లతో పురుగుమందు పిచికారీ సూచించటంతో పాటు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిందని, కాబట్టి సీఎం జగన్ కూడా దీనిపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతానికి దీనిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని, ఏడాది సంబరాలు పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఉన్నారని విమర్శలు చేశారు.

 

అయితే చినబాబు ఇచ్చిన సలహాపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. లోకేష్ ఇచ్చిన సలహా బాగానే ఉందని, కాకపోతే మిడతల దండు ప్రమాదం నుంచి తప్పించాలంటే ఒక్క బాబు వల్లే అవుతుందని, టెక్నాలజీ వాడి ఎండలు తగ్గించడానికే బాబు ప్రయత్నించారని, కాబట్టి  మిడతల దండు రాకుండా ఏదైనా టెక్నాలజీ వాడాలని ఎద్దేవా చేస్తున్నారు. ఇక చినబాబు ఉచిత సలహాలు ఏమి అక్కర్లేదని, జగన్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తప్పకుండా తీసుకుంటుందని, కాబట్టి చినబాబు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదని, రైతులకు ప్రభుత్వం పలు జాగ్రత్తలు చెబుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: